
ప్రకృతి కన్నెర్ర జేస్తే ఎలా ఉంటుందో.. క్షణాల్లో ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోతాయో చూపించే ఒక నమ్మశక్యం కాని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కొండపై నుంచి భారీగా కొండచరియలు విరిగిపడుతుండగా.. ఓ బైకర్ వాటితో పాటే కొట్టుకుపోయిన ఒళ్లు గగుర్పొడిచే ఘటన అరుణాచల్ ప్రదేశ్‌లో వెలుగుచూసింది. అంత పెద్ద ప్రమాదం జరిగినా, ఆ బైకర్ చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ భయానక ఘటన జూన్ 28న అరుణాచల్ ప్రదేశ్‌లోని లోయర్ సియాంగ్ జిల్లా సిజి ప్రాంతంలో జరిగింది. ఈశాన్య భారత దేశంలో ప్రస్తుతం నైరుతి రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి కొండ ప్రాంతాల్లోని రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఓ బైకర్ బురదమయంగా మారిన కొండ రహదారిపై నుంచి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడు సగం దూరం వెళ్లేసరికి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. కనురెప్ప మూసి తెరిచేలోగా.. ఆ బైకర్‌తో పాటు అతడి మోటార్ సైకిల్ కూడా ఆ మట్టి శిథిలాల ప్రవాహంలో కొట్టుకుపోయాయి. కొండపై నుంచి నేరుగా కింద ప్రవహిస్తున్న సిజి నదిలోకి ఆ బురద, రాళ్లతో పాటు బైకర్ కూడా పడిపోయాడు. కొండచరియలు పడటంతో ఆ నదీ ప్రవాహం కూడా కాసేపు స్తంభించిపోయింది.
ఈ దృశ్యాలన్నీ అక్కడే ఉన్న కొందరు మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయడంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అంత ఎత్తు నుంచి నదిలోకి పడిపోయినప్పటికీ.. ఆ బైకర్ ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు.. ‘‘ఇది ఖచ్చితంగా పునర్జన్మే.. ఇతడు వెంటనే వెళ్లి ఒక లాటరీ టికెట్ కొనుక్కోవాలి, అంత అదృష్టం ఉంది’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం వర్షాల కాలం కావడంతో కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో మరోసారి గుర్తు చేస్తోంది. క్షణాల్లో వాతావరణం మారిపోయి కొండలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున, అత్యవసరమైతే తప్ప కొండ దారుల్లో ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Hair raising video from Arunachal Pradesh shows a biker riding a landslide (28.06.2026)
Amidst incessant rains across NE India, a video from Siji, Lower Siang shows a landslide carrying a biker down with it & blocking the Siji River.
Luckily, the biker escaped unharmed. He… pic.twitter.com/ypRiZRQjQJ
— Kyang Thang རྐྱང་ཐང་ (@Kyangs_Thang) June 28, 2026