
సిలికాన్ సిటీ బెంగళూరులో ఒక్కసారి వాన పడితే చాలు.. సామాన్యుల జేబులకు చిల్లు పడాల్సిందే. ట్రాఫిక్ కష్టాలు ఒకవైపు ఉంటే, ఆటోలు, క్యాబ్ డ్రైవర్ల ఇష్టారాజ్యంగా పెంచేసే ధరలు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఓ యువతి తన స్నేహితురాలికి ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, అదిప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సాన్యా సింగ్ అనే యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఇటీవల బెంగళూరులో భారీ వర్షం కురుస్తున్న సమయంలో తన స్నేహితురాలు కేవలం 15 కిలోమీటర్ల ప్రయాణానికి ఏకంగా రూ. 1,200 ఆటో ఛార్జీగా చెల్లించాల్సి వచ్చిందని ఆమె పేర్కొంది. సాధారణంగా ఉండాల్సిన ధర కంటే ఇది చాలా రెట్లు ఎక్కువని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఎయిర్‌పోర్ట్ ఛార్జీ కంటే ఎక్కువే
ఆమె పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. అది చూసిన చాలా మంది నెటిజన్లు ఈ ఘటనపై రకరకాలు స్పందించారు.
రూ. 1,200 అంటే దాదాపు ఫ్లైట్ టికెట్‌తో సమానం అని కొందరు కామెంట్ చేయగా.. ఒక సామాన్యుడి రోజూవారీ సంపాదన కూడా అంత ఉండదు, ఇలాంటి ఛార్జీలు ఉండే మనుగడం సాగించడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
వీడియో చూడండి..
వర్షం వస్తే చాలు.. కష్టాలు షురూ
నగరంలో వర్షం పడితే రోడ్లన్నీ చెరువుల్లా మారుతుంటాయి. ఆ సమయంలో బస్సులు, మెట్రోలకు వెళ్లడం కష్టమై చాలామంది ఆటోలను ఆశ్రయిస్తుంటారు. దీన్నే అదునుగా తీసుకుంటున్న కొందరు డ్రైవర్లు డిమాండ్‌ను బట్టి భారీగా ధరలు పెంచుతున్నారు. యాప్ ఆధారిత సేవలలో కూడా సర్జ్ ప్రైసింగ్ పేరుతో భారీ దోపిడీ జరుగుతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇలా ఇష్ట్యారాజ్యంగా ఛార్జీలు పెంపుపై అధికారులు దృష్టి సారించాలని, వర్షం సమయాల్లో ప్రయాణికులను దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని బెంగళూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.