రాజు మరణిస్తే సేవకులనూ చంపి పూడ్చారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ.. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆధారాలు!

పురాతన ఈజిప్టు రాజుల అంత్యక్రియల వెనుక దాగున్న ఓ భయంకరమైన ఆచారానికి సంబంధించిన కీలక ఆధారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రాజు మరణించినప్పుడు ఆయనకు సేవలు అందించే కొంతమంది సేవకులను కూడా చంపి, రాజు సమాధుల సమీపంలో పాతిపెట్టేవారనే అనుమానాలకు ఫోరెన్సిక్ పరీక్షలు బలం చేకూర్చాయి. వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన మానవ అవశేషాలను ఆధునిక పద్ధతుల్లో పరిశీలించడంతో ఈ విషయం బయటపడింది. 5 వేల ఏళ్ల క్రితం ఏం జరిగింది?

రాజు మరణిస్తే సేవకులనూ చంపి పూడ్చారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ.. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఆధారాలు!
Ancient Egyptians Sacrificed Servants When Kings Died Forensic Tests Show

Updated on: Oct 11, 2026 | 10:21 PM

ఈ పరిశోధనకు సంబంధించిన మానవ అవశేషాలను ఈజిప్టులోని తూర్పు ప్రాంతంలో ఉన్న అబిడోస్ (Abydos) వద్ద రాజుల అంత్యక్రియల సముదాయాల నుంచి వెలికితీశారు. ఈ సమాధులు క్రీస్తుపూర్వం సుమారు 3000 సంవత్సరం నాటివిగా గుర్తించారు. అంటే, ఇవి దాదాపు 5 వేల సంవత్సరాల క్రితం నాటివి. 1920వ దశకంలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఫ్లిండర్స్ పీట్రీ ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. రాజుల సమాధుల చుట్టూ పెద్ద సంఖ్యలో ఇతర వ్యక్తుల సమాధులు ఉండటాన్ని గుర్తించారు. రాజులకు సేవలు అందించే సేవకులు అయి ఉండొచ్చని, రాజు మరణించినప్పుడు వారిని కూడా బలి ఇచ్చి ఉండవచ్చని అప్పట్లోనే అనుమానించారు.అయితే, ఆ వ్యక్తులు ఎలా మరణించారో నిర్ధారించే ఆధారాలు అప్పట్లో లభించలేదు. తాజాగా ఆధునిక ఫోరెన్సిక్ పద్ధతులతో జరిపిన పరిశీలనలో కీలక విషయాలు బయటపడ్డాయి.

46 పుర్రెలను పరిశీలించగా.. 18 మందికి ప్రాణాంతక గాయాలు!

పర్డ్యూ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు రోసెలిన్ ఎ. క్యాంప్‌బెల్ ఈ పుర్రెలను పరిశీలించారు. గతంలో వెలికితీసిన అవశేషాల్లో చాలా వరకు మళ్లీ భూమిలో పాతిపెట్టగా, పుర్రెలను మాత్రం భద్రపరిచారు. వాటిలో 46 పుర్రెలను క్యాంప్‌బెల్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో గుర్తించి పరిశీలించారు. 46 పుర్రెల్లో 18 మందికి ప్రాణాంతక తలకు గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అంటే పరిశీలించిన పుర్రెల్లో దాదాపు 39 శాతం మందికి తీవ్రమైన గాయాలున్నాయి. పొడవుగా, సరళ రేఖల మాదిరిగా కనిపించే ఎముక పగుళ్లుగా ఉన్నాయి. వెడల్పుగా, చదునుగా ఉన్న ఆయుధంతో కొట్టడం వల్ల ఇలాంటి గాయాలు ఏర్పడి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గాయాలు వేగంగా స్పృహ కోల్పోవడానికి, అంతర్గత రక్తస్రావానికి, చివరికి మరణానికి దారితీసి ఉండవచ్చని క్యాంప్‌బెల్ వివరించారు.

రాజుతో పాటు సేవకులను ఎందుకు చంపేవారు?

పురాతన కాలంలో కొన్ని సమాజాల్లో రాజు మరణించినప్పుడు ఆయనకు సేవలు అందించిన వ్యక్తులను కూడా బలి ఇచ్చి, సమాధిలో లేదా సమాధి సమీపంలో పాతిపెట్టే ఆచారం ఉండేదని పరిశోధకులు చెబుతున్నారు. దీని వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు. రాజు మరణించిన తర్వాత కూడా మరో లోకంలో ఆయనకు సేవలు అందించడానికి సేవకులు అవసరమవుతారని కొందరు నమ్మి ఉండవచ్చు. తన ఆధీనంలో ఉన్నవారిపై రాజుకు ఎంతటి అధికారం ఉందో చూపించడానికి కూడా ఈ ఆచారం ఉపయోగపడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే, బలి ఇచ్చిన వారందరి పరిస్థితి ఒకేలా ఉండకపోవచ్చని క్యాంప్‌బెల్ అన్నారు. కొందరు గౌరవం లభిస్తుందనే నమ్మకంతో స్వచ్ఛందంగా ప్రాణాలు అర్పించి ఉండవచ్చు. మరికొందరిని ఎంపిక చేసి ఉండవచ్చు. ఇంకొందరిని బలవంతంగా చంపి ఉండే అవకాశం ఉందని ఆమె వివరించారు.

గొంతు నులిమి చంపారా? విషం ఇచ్చారా? ఇప్పుడు ఏం తెలిసింది?

గతంలో ఈ సేవకులను ఎలా చంపేవారనే విషయంపై స్పష్టత లేదు. గొంతు నులిమి చంపడం, విషం ఇవ్వడం వంటి పద్ధతులను పరిశోధ కులు అనుమానించారు. కానీ తాజా పరిశోధనలో పుర్రెలపై కనిపించిన గాయాలు తలపై బలమైన దెబ్బలు తగలడం వల్ల మరణించి ఉండవచ్చని సూచిస్తున్నాయి.రాజుల సేవకులను బలి ఇచ్చేవారనే సిద్ధాంతానికి తొలిసారిగా ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి.

అయితే.. అందరినీ బలి ఇచ్చినట్లేనా?

పరిశీలించిన పుర్రెల సంఖ్య తక్కువగా ఉండటం, అవశేషాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం, వేల సంవత్సరాల కాలవ్యవధి గడిచిపోవడం వంటి కారణాల వల్ల ప్రతి ఒక్కరి మరణానికి కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడం సాధ్యం కాదని తెలిపారు. కొంతమంది సహజ మరణం పొంది ఉండవచ్చు. మరికొందరిని ఊపిరాడకుండా చేయడం వంటి పద్ధతుల్లో చంపి ఉండవచ్చు. అలాంటి మరణాలకు పుర్రెలపై స్పష్టమైన గాయాలు కనిపించకపోవచ్చు. అందువల్ల, పరిశోధనలో పరిశీలించిన వారందరూ బలికి గురయ్యారని చెప్పలేమని ఆమె స్పష్టం చేశారు.

ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు Frontiers in Environmental Archaeology అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధన ఆధారంగా క్యాంప్‌బెల్ 2027లో ప్రచురించేందుకు ఓ పుస్తకాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. అందులో రాజులకు సేవలు అందించిన ఆ వ్యక్తులు ఎవరు? అప్పటి ఈజిప్టు సమాజంలో వారి స్థానం ఏమిటి? బలి ఆచారాల వెనుక ఉన్న నమ్మకాలు ఏమిటి? వంటి అంశాలను మరింత లోతుగా పరిశీలించనున్నారు. మొత్తంగా, పురాతన ఈజిప్టులో రాజుల మరణం తర్వాత సేవకులను కూడా బలి ఇచ్చేవారనే చాలాకాలం నాటి అనుమానానికి ఈ పరిశోధన కొత్త ఆధారాలను అందించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us