
మాములుగా ఒక పాము కనిపిస్తేనే మన వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది కుప్పల తెప్పులుగా పాములు తమ ఇంట్లోకి వస్తూ ఉంటే.. ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఊహించడమే కష్టంగా ఉంది. ఉత్తరప్రదేశ్ మీరట్ జిల్లా సమౌళీ గ్రామంలో ఆదివారం రోజు ఈ ఘటన వెలుగుచూసింది. గ్రామస్థుడు మహఫూజ్ సైఫీ తన గోశాలలో ఉన్నప్పుడు ఒకేరోజు ఏకంగా ఒకదాని వెంట ఒకటి 52 సర్పాలు రావడంతో కలకలం చెలరేగింది.
మహఫూజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట అతను 1 నుంచి 1.5 అడుగుల పొడవు గల ఒక పాముని చూశాడు. ఆ తర్వాత ఒకదాని వెంట ఒకటి పాముల రావడం ప్రారంభించాయి. రాత్రి 9 గంటల వరకు అతను దాదాపు 52 సర్పాలను హతమార్చి గుంతలో పూడ్చిపెట్టాడు. ఆ పాములు ఎక్కడినుండి వచ్చాయన్నదానిపై తనకు స్పష్టత లేదని మహఫూజ్ తెలిపాడు..
వాస్తవానికి ఇన్ని పాములు కనిపిస్తే.. అటవీశాఖకు లేదా స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వాల్సింది. కానీ అతను మాత్రం వచ్చిన పామును వచ్చినట్లు చంపడం ప్రారంభించాడు. సర్పాల నిపుణుడు, పర్యావరణ సంస్థ అధ్యక్షుడు ఆదిత్య తివారీకి ఈ ఘటనపై సమాచరాం అందింది. పాములను పరిశీలించిన ఆయన.. అవి నీటి సర్పాలు(చెకర్డ్ కీల్‌బ్యాక్ వాటర్ స్నే్క్స్) అని చెప్పారు. అవి విషరహితమైనవని.. ఒక ఆరోగ్యకరమైన ఆడ పాము 40-50 గుడ్లు పెడుతుందని చెప్పారు. అవన్నీ ఇటీవల జన్మించిన పాము పిల్లలు అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
అటవీశాఖ అధికారి రాజేష్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పాములు భారతీయ అటవీ జీవ సంరక్షణ చట్టం కింద రక్షిత జీవాలు. వీటిని హతమార్చడం లేదా గాయపరచడం నేరం. ఘటనపై దర్యాప్తు చేసి, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..