
Spider Bite: ఓ సాలీడు కాటు 73 ఏళ్ల వృద్ధుడిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. కాసేపటికే కాలికి భారీగా వాపు రావడంతో భరించలేని నొప్పితో ఆసుపత్రి పాలయ్యారు. 18 రోజులు చికిత్స తీసుకున్నా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఇంగ్లండ్‌కు చెందిన 73 ఏళ్ల గ్లెన్ ప్రీస్ట్లీకి విచిత్ర అనుభవం ఎదురైంది.
సాలీడు కాటు ప్రమాదకరం కాదని ఇంగ్లండ్‌లోని బ్లాక్పూల్కు చెందిన 73 ఏళ్ల గ్లెన్ ప్రీస్ట్లీ భావించారు . అయితే కాటు తర్వాత తీవ్రమైన లక్షణాలు కనిపించాయి. సాలీడు కుట్టిన వెంటనే పెద్దగా నొప్పి అనిపించలేదు. కొన్ని గంటల తర్వాత పరిస్థితి మారిపోయింది. కాలిలో నొప్పి మొదలై, క్రమంగా వాపు పెరిగింది. కాలు ఎర్రగా మారడంతో పాటు తాకితే వేడిగా అనిపించింది. నొప్పి భరించలేక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. రక్త పరీక్షల్లో ఇన్ఫెక్షన్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తెలిసింది. దీంతో వైద్యులు మరిన్ని పరీక్షలు నిర్వహించారు. ఎంఆర్ఐ (MRI), సీటీ స్కాన్ (CT Scan), ఎక్స్‌రే (X-ray) చేశారు. ఈ పరీక్షల అనంతరం కాలిలో తీవ్రమైన వాపునకు ఫాల్స్ విడో సాలీడు కాటు కారణమని వైద్యులు నిర్ధారించారు.
తన తల్లిని చూసుకుంటూ ఆమె ఇంటి పై అంతస్తులో ఉన్న గదిలో పనులు చేస్తున్న సమయంలో, ఓ దుప్పటి కింద చిన్న పురుగులా కనిపించిన జీవిని గమనించారు. అది కుట్టినప్పుడు సూదితో గుచ్చినట్లుగా స్వల్పంగా నొప్పి అనిపించింది. అయితే, అది సాధారణంగా ఇళ్లలో కనిపించే హానికరం కాని సాలీడు అయి ఉంటుందని భావించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఆ తర్వాత కొన్ని గంటలకు ఆయన కాలిలో వాపు, నొప్పి తీవ్రంగా పెరిగాయి. చివరకు ఈ ఘటన ఆయనను ఆసుపత్రి పాలయ్యేలా చేసింది.
సాలీడు కాటు తర్వాత గ్లెన్ కాలిలో వాపు వేగంగా పెరిగింది. కాలు పెద్ద పుచ్చకాయ పరిమాణంలో ఉబ్బిపోయింది. కాలు వాపు, నొప్పి తీవ్రం కావడంతో గ్లెన్ మరుసటి రోజు వైద్యులను సంప్రదించారు. ఆయన కాలి పరిస్థితిని గమనించిన వైద్యులు వెంటనే రక్త పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను బ్లాక్పూల్ విక్టోరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గ్లెన్ ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చింది. మొదట ఎర్రగా కనిపించిన కాలు, రోజులు గడిచే కొద్దీ మరింత తీవ్ర పరిస్థితికి చేరుకుంది. అక్టోబర్ 6న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటికీ అతనింకా పూర్తిగా కోలుకోలేదు. ఒక నెల గడిచినా కాలిలో, పాదంలో వాపు కొనసాగుతోందని గ్లెన్ తెలిపారు. ప్రస్తుతం కూడా నర్సు ఇంటికి వచ్చి చికిత్స అందిస్తున్నారు. కాలుకు కట్టు కట్టాల్సి వస్తోందని, నొప్పి కారణంగా సరిగ్గా నడవలేక వాకర్ సాయంతో కదులుతున్నానని చెప్పారు. నొప్పి తీవ్రతను 1 నుంచి 10 వరకు అంచనా వేస్తే.. తనకు 9 స్థాయిలో నొప్పి ఉందని గ్లెన్ వివరించారు.
గ్లెన్ను కుట్టింది ‘నోబుల్ ఫాల్స్ విడో’ (Noble False Widow) అనే సాలీడుగా అనుమానిస్తున్నారు. బ్రిటన్‌లో కనిపించే విషపూరిత సాలీడుల్లో ఇది కూడా ఒకటి. బ్రిటన్‌లోని సాలీళ్లపై అధ్యయనం చేసే కీటక శాస్త్రవేత్త డీ పటేల్ మాట్లాడుతూ.. ఫాల్స్ విడో సాలీడు కాటు ఘటనలు చాలా అరుదని, గ్లెన్‌కు ఎదురైన పరిస్థితి దురదృష్టకరమని తెలిపారు. సాలీడు కుట్టిన తర్వాత తీవ్రమైన నొప్పి, వాపు లేదా ఇతర అసాధారణ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.
ఇటీవల గ్లెన్ ప్రీస్ట్లీ గుడ్ మార్నింగ్ బ్రిటన్ కార్యక్రమంలో పాల్గొని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు. సాలీడు కుట్టిన తర్వాత తన కాలు పెద్ద పుచ్చకాయ పరిమాణంలో వాపునకు గురైందని, 18 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చిందని చెప్పారు. తనకు ఎదురైన అనుభవం చాలా భయంకరంగా, బాధాకరంగా ఉందని గ్లెన్ తెలిపారు. సాలీడు కుట్టినట్లు అనుమానం వచ్చినప్పుడు మొదట పెద్దగా పట్టించుకోలేదని, కానీ ఆ తర్వాత పరిస్థితి తీవ్రంగా మారిందని చెప్పారు. సాలీడు కాటు తర్వాత తీవ్రమైన నొప్పి వేగంగా పెరుగుతున్న వాపు కనిపించి వెంటనే వైద్యులను సంప్రదించానని, కాటు వేసిన జీవి ఏదో తెలియకపోయినా, లక్షణాలు తీవ్రంగా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలని గ్లెన్ హెచ్చరించారు.