పేదరికం, అనారోగ్య సమస్యల కారణంగా కొందరు తమ పిల్లల్ని, అయినవారిని అనాథలుగా విడిచిపెట్టే ఘటనలు అప్పుడప్పుడూ చూస్తుంటా..కానీ, ఓ చోట ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను తననుంచి దూరంగా పంపించాలనుకున్నాడు. అందుకోసం దానికి ఓ ప్లాన్ చేశాడు. కుక్కను ఓ భద్రమైన ప్రాంతంలో ఉంచి, దాని పక్కనే అవసరమైన వస్తువులతో ఓ బ్యాగును పెట్టాడు. పక్కనే ఓ లేటర్ కూడా రాసి ఉంచాడు. అది చూసిన యానిమల్ చారిటీ వారు చలించిపోయారు. ఆ కుక్కను తీసుకెళ్లి తమ ట్రస్ట్‌లోనే పెట్టారు. ఇంతకీ ఆ లేటర్‌లో ఏముంది..? ఎందుకు ఆ కుక్క యజమాని దాన్ని వదిలించుకోవాలనుకున్నాడు.
పాపం యజమాని పక్కన లేకపోవటంతో బిక్కుబిక్కుమంటూ చూస్తుంది ఇక్కడో పెంపుడు కుక్క. దీని పేరు బేబీ గర్ల్..దాని యజమాని దీనికి ఎంతో ముద్దుగా పెట్టుకన్న పేరు ఇది. అయితే, బేబీ గర్ల్ డాగ్‌ని ఇలా విడిచిపెట్టడానికి ఓ బలమైన కారణం చెబుతున్నాడు యజమాని. బేబీ గర్ల్‌కి కెనైన్ డయాబెటిస్ (డయాబెటిస్ మిల్లిటస్) అనే వ్యాధి ఉందని గుర్తించారు. ఆ వ్యాధి చికిత్స కోసం నెలనెలా కుక్కకు ఇన్సులిన్‌ను, మరిన్ని రకాల మందులూ కొనాల్సి ఉంటుందట. ప్రత్యేకమైన తిండిని పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ప్రతి నెలా రూ. వేలల్లోనే ఖర్చవుతుందట. అయితే, పాపం బేబీ గర్ల్ యజమాని సైతం గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అతడు లేఖలో ప్రస్తావించాడు. కుక్కను వదిలించుకోవటం తనకు ఎంతో బాధాకరమైన విషయమే అయినప్పటికీ తప్పటంలేదని చెప్పుకొచ్చాడు. అయితే, చివరకు కుక్కను చారిటీ వారు తీసుకెళ్లారని తెలుసుకుని సంతోషపడ్డాడట. కాగా, ఈ ఫోటో, కుక్కకు సంబంధించిన వ్యాధి గురించి తెలుసుకున్న నెట్టిజన్లు సైతం చలించిపోయారు.