YS Sharmila Khammam party meeting : ఖమ్మం సంకల్పసభకు నేతల్ని సిద్ధం చేశారు వైఎస్ షర్మిల. తండ్రి పాదయాత్ర ప్రారంభించిన రోజునే పార్టీ ప్రకటనకు ముహూర్తంగా ఎంచుకున్నారు షర్మిల. సంకల్ప సభలో పార్టీ విధివిధానాలు ప్రకటించబోతున్నారు. ఈ కీలక సభ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈనెల 9న వైఎస్ షర్మిల ప్రజా సంకల్ప సభ జరుగుతుందని పార్టీ తెలంగాణ ఇంచార్జ్ రాఘవరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఖమ్మం నగరంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ వైఎస్ షర్మిల సభను నిర్వహిస్తామన్నారు.
కాగా, ఇవాళ తెలంగాణలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల నాయకులు, కార్యకర్తలతో షర్మిల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. పదో జిల్లా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు రాఘవరెడ్డి. ఈ సభలో పార్టీ విధి విధానాలను, భవిష్యత్ కార్యాచరణను వైఎస్ షర్మిల ప్రకటిస్తారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీసేందుకే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారన్నారు రాఘవరెడ్డి. సంకల్పసభను అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా..వైఎస్ షర్మిలకు ఘన స్వాగతం పలికి సభను విజయవంతం చేసుకుంటామన్నారు రాఘవరెడ్డి.
ఇలాఉండగా, సంకల్పసభకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిలను నాయకులు, ప్రముఖులు కలుసుకుంటున్నారు. ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. తాజాగా తెలంగాణ మాజీ డీజీపీ స్వర్ణజిత్‌సేన్ దంపతులు లోటస్‌పాండ్‌లో షర్మిలను కలుసుకున్న సంగతి తెలిసిందే. షర్మిల కొత్త పార్టీ పెట్టటాన్ని స్వర్ణజిత్‌సేన్ స్వాగతించడమేకాదు, పార్టీ వ్యూహరచనలోనూ సహకరిస్తున్నట్టు సమాచారం.