
ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో చైనా ఒక అడుగు ముందుకు వేసి, ధ్వని వేగానికి చేరువలో ప్రయాణించే ‘మ్యాగ్లెవ్’ రైలును విజయవంతంగా పరీక్షించింది. ‘T-Flight’ అని పిలిచే ఈ రైలు గంటకు ఏకంగా 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. అంటే, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కేవలం ఒకటిన్నర గంటలోపే చేరుకోవచ్చన్నమాట! సాధారణ రైళ్లలాగే ఇవి పట్టాలపై చక్రాలతో పరుగెత్తవు. అయస్కాంత శక్తిని ఉపయోగించి పట్టాలకు కొద్దిగా పైన గాలిలో తేలుతూ ప్రయాణిస్తాయి.
దీనివల్ల ఘర్షణ ఉండదు. చైనా అభివృద్ధి చేసిన ఈ లేటెస్ట్ వెర్షన్‌లో రైలును ఒక వ్యాక్యూమ్ ట్యూబ్‌లో పంపిస్తారు. గాలి పీడనం లేకపోవడం వల్ల ఇది విమానం కంటే వేగంగా దూసుకుపోతుంది. దేశం ప్రస్తుతం వందే భారత్, ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులపై దృష్టి సారించింది. మ్యాగ్లెవ్ సాంకేతికతను భారత్‌కు తీసుకురావడంపై గతంలో కొన్ని చర్చలు జరిగాయి. అయితే, దీని నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ. ఒక కిలోమీటరు మ్యాగ్లెవ్ ట్రాక్ నిర్మించడానికి అయ్యే ఖర్చు, సాధారణ బుల్లెట్ రైలు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది.
భారత ప్రభుత్వం ప్రస్తుతం ‘నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్’ ద్వారా స్వదేశీ హై స్పీడ్ రైళ్లపై పరిశోధనలు చేస్తోంది. అలాగే అమెరికాకు చెందిన హైపర్‌లూప్ సంస్థలతో కూడా చర్చలు జరిగాయి. కానీ, చైనా టెక్నాలజీని నేరుగా భారత్ తీసుకునే అవకాశాలు తక్కువ. అయితే, భవిష్యత్తులో మన శాస్త్రవేత్తలు ఇదే తరహా సాంకేతికతను అభివృద్ధి చేస్తే తప్పకుండా భారత్‌లో కూడా ఇలాంటి వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. ప్రస్తుతానికి మన ఫోకస్ గంటకు 250-320 కి.మీ వేగంతో ప్రయాణించే రైళ్లపైనే ఉంది.