
ప్రశాంతంగా ఉండే సిద్దిపేట పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అడవి నుంచి తప్పి వచ్చిందో ఏమో కానీ, ఒక అడవి పంది పట్టణంలోని పటేల్ పుర వీధిలో హల్‌చల్ సృష్టించింది. జనవాసాల్లోకి చొరబడటమే వచ్చి కంటపడిన వారిపై విచక్షణారహితంగా దాడికి తెగబడటంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. సాధారణ రోజులాగే పటేల్ పుర వీధిలో జనం తమ పనుల్లో నిమగ్నమై ఉండగా, అకస్మాత్తుగా ఒక అడవి పంది రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఎదురుగా వస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని వేగంగా దాడికి దిగింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడి వారు షాక్‌కు గురయ్యారు. ఆ పంది దాడిలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. రక్తసిక్తమైన వారిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.
ఈ దాడి ఎంత భయంకరంగా జరిగిందో అక్కడ ఉన్న సీసీ కెమెరా దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. పంది అతివేగంగా వచ్చి మనుషులపైకి దూకడం, వారు తప్పించుకునే ప్రయత్నం చేయడం వంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విజువల్స్ చూసిన పట్టణ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.‘‘పందుల సంచారం పెరిగిపోవడంతో పిల్లలను, వృద్ధులను బయటకు పంపాలంటేనే భయం వేస్తోంది. పట్టణ నడిబొడ్డున ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం’’ అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులు ఇలా ఊళ్లలోకి రావడంపై అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.