
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన క్యాన్సల్ అయింది. అమెరికా, యూకే వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరగా కేవలం యూకే పర్యటనకు మాత్రమే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజకీయ కారణాల నేపథ్యంలో అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం కుదరదని విదేశాంగ శాఖ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 23న హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే హార్వర్డ్, MIT, నార్త్ ఈస్టర్న్, వర్జీనియా టెక్‌లతో ఒప్పందాలే లక్ష్యంగా అమెరికా టూర్ ప్లాన్ చేసిన సీఎం రేవంత్.. తాను లేకపోయినా ప్రతినిధి బృందంతో MoUలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించినప్పటికీ.. ఇందుకు నిర్దిష్ట కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. విదేశీ పర్యటనకు సంబంధించిన క్లియరెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించగా.. అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతోనే క్లియరెన్స్ ఇవ్వడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. రేవంత్ పర్యటనలో ఏ అంశంపై కేంద్రానికి అభ్యంతరం ఉంది? అన్నదానిపై ఇప్పటివరకు MEA ఎలాంటి వివరణ ఇవ్వలేదు. తెలంగాణ CMO కూడా ఇదే అంశంపై కేంద్రాన్ని మరింత స్పష్టత కోరుతోంది.
మరోవైపు రేవంత్ రెడ్డి ఫారిన్ టూర్‌పై తెలంగాణలోనూ రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి లండన్ టూర్‌ను రాజకీయం చేస్తున్నారని, బీజేపీ నేతలకు మెదడు పనిచేయడం లేదని ప్రభుత్వ విప్ మండిపడ్డారు. యూనివర్సిటీలకు వెళ్లి అక్కడి విద్యా ప్రమాణాలను పరిశీలిస్తే బీజేపీ నాయకులకు ఎందుకు నొప్పి అంటూ ఆగ్రహించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,