
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీలోని అర్థరాత్రి కలకలం రేగింది. సింగరేణి కార్మికుల నివాస ప్రాంతంలో ఓ భారీ కొండచిలువ ప్రత్యక్షమై స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. పీవీ కాలనీ సూపర్ బజార్ ఏరియాలోని క్వార్టర్స్ సమీపంలో ఉన్న చెట్ల పక్కన రాత్రి వేళ వింతగా భారీ శబ్దాలు వినిపించాయి. మొదట స్థానికులు ఏదో శబ్దం అనుకుని పెద్దగా పట్టించుకోలేదు.
అయితే అటుగా వెళ్తున్న కొందరు అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా, నల్లని చారలతో మెరుస్తూ, పాకుతూ ఉన్న భారీ కొండచిలువ కనిపించింది. దీంతో ఒక్కసారిగా గుండె గుబేలుమన్నంత పనైంది. జనావాసాల మధ్య అంత పెద్ద జీవిని చూసి కాలనీవాసులు, మహిళలు, చిన్నారులు తీవ్ర భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఇక వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ ముజఫర్‌కు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ముజఫర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ భారీ కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కొండచిలువను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తమను భయం నుంచి కాపాడిన స్నేక్ క్యాచర్ ముజఫర్‌కు కాలనీవాసులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
అయితే, ఇటీవల కాలంలో క్వార్టర్స్ పరిసరాల్లోకి పాములు, కొండచిలువల సంచారం విపరీతంగా పెరగడంతో స్థానికులు రాత్రి వేళల్లో అటువైపు వెళ్లాలంటేనే భయపడుతూ, బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.