
వరంగల్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పులిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఓ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్కను కూడా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరంగల్‌లోని రంగశాయిపేటలో ఎస్‌బీఐ బ్యాంకు సమీపంలో సంజయ్ కుమార్, శోభ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా.. వారు ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. సంజయ్ కుమార్ ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
ఇటీవల అవసరాల కోసం సంజయ్ దంపతులు చుట్టుపక్కల కొందరి వద్ద అప్పులు తీసుకున్నారు. అయితే అప్పులు తిరిగి చెల్లించాలంటూ డబ్బులు ఇచ్చినవారి నుంచి ఒత్తిడి పెరగడంతో వారు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు తమ పెంపుడు లాబ్రడార్ కుక్కకు విషం ఇచ్చి చంపినట్లు సమాచారం.
ఆత్మహత్యకు ముందు దంపతులు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. తమ ఆర్థిక ఇబ్బందులే ఈ నిర్ణయానికి కారణమని అందులో పేర్కొన్నట్లు సమాచారం. వడ్డీ వ్యాపారం, ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ మహిళా టైలర్ తమను ఇబ్బందులకు గురిచేసినట్లు లేఖలో ఆరోపించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్‌లో చేసిన ఆరోపణలతో పాటు అప్పుల వ్యవహారం, దంపతుల ఆత్మహత్యకు దారితీసిన ఇతర కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.