
మొబైల్ ఫోన్ దొంగిలించాడనే చిన్న అనుమానం ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఎలాంటి నిర్ధారణ లేకుండానే ఓ వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసిన దారుణ ఘటన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 27న వినాయక చవితి సందర్భంగా అన్నదానం కార్యక్రమం జరుగుతున్న సమయంలో గుండెని ప్రవీణ్‌కు చెందిన మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. దీంతో అతడు ఫోన్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 29న ‘ఫైండ్ మై డివైస్’ యాప్ ద్వారా ఫోన్ లొకేషన్‌ను ట్రాక్ చేశాడు. యాప్ చూపించిన లొకేషన్ ఆధారంగా వెతకగా.. బ్యాగరి రామానుజానికి చెందిన పొలంలోని రాళ్ల మధ్య ఓ ప్లాస్టిక్ కవరులో మొబైల్ ఫోన్ లభించింది. దీంతో రామానుజమే ఫోన్‌ను దొంగిలించాడనే అనుమానం ప్రవీణ్‌తో పాటు అతని అనుచరుల్లో బలపడింది.
ఈ అనుమానంతో కక్ష పెంచుకున్న గుండెని ప్రవీణ్, గుండెని రమేష్, ఎంకమొల్ల రమేష్, గుండెని బాబురావు, నాగని రామానుజం, ఎంకమొల్ల ప్రశాంత్, మాసాని శ్రీను, గుండెని సత్యనారాయణ.. అర్ధరాత్రి సమయంలో బ్యాగరి రామానుజంపై దాడికి పాల్పడ్డారు. చేతులు, కాళ్లతో తన్నడంతో పాటు కర్రలతో రామానుజాన్ని విచక్షణారహితంగా కొట్టినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న రామానుజం భార్య, కుమార్తె అక్కడికి చేరుకుని దాడి చేయొద్దంటూ నిందితులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గకుండా దాడి కొనసాగించినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన రామానుజం అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిలో ఎలాంటి కదలికలు లేకపోవడాన్ని గమనించిన నిందితులు భయంతో అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తూప్రాన్ సీఐ వెంకటరాజాగౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో అరెస్టైన వారిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు తూప్రాన్ సీఐ వెల్లడించారు. మొబైల్ ఫోన్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఎలాంటి నిర్ధారణ లేకుండానే దాడికి పాల్పడటం, చివరకు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.