Kishan Reddy: హైదరాబాద్‌–శ్రీశైలం హైవేపై కొట్టుకుపోయిన రోడ్డు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన

సైక్లోన్‌ మోంథా ప్రభావంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా లట్టిపూర్‌ వద్ద హైదరాబాద్‌–శ్రీశైలం హైవే దెబ్బతింది. రహదారి కొట్టుకుపోవడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వరద నీరు తగ్గిన వెంటనే రోడ్డు పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నాటికి ట్రాఫిక్‌ పూర్తి స్థాయిలో పునరుద్ధరించనున్నట్టు చెప్పారు.

Kishan Reddy: హైదరాబాద్‌–శ్రీశైలం హైవేపై కొట్టుకుపోయిన రోడ్డు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన
Kishan Reddy

Updated on: Oct 30, 2025 | 9:07 PM

మోంథా తుఫాన్ కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదల కారణంగా చాలా మార్గాల్లో రోడ్డు వ్యవస్థ ధ్వంసం అయింది. వరదల తీవ్రతకు నాగర్‌కర్నూల్‌ జిల్లా లట్టిపూర్‌ గ్రామం వద్ద హైదరాబాద్‌–శ్రీశైలం హైవే (NH-765) తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాల వల్ల 111/335 కిలోమీటర్ల వద్ద రహదారి కొట్టుకుపోవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, అభివృద్ధి శాఖల మంత్రి జీ. కిషన్‌రెడ్డి స్పందించారు. అక్కడి దుస్థితిపై రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతోపాటు సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడినట్టు తెలిపారు.

“వరద నీరు తగ్గిన వెంటనే రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం గ్రావెల్‌ ఫిల్లింగ్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర రహదారి శాఖ అధికారులు, ఇంజినీర్లు రాత్రిపూట కూడా పని చేస్తున్నారు. అక్టోబర్‌ 31 మధ్యాహ్నం నాటికి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు” అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం రహదారి చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి కుంగిపోవడం, రహదారి పగుళ్ల వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తాత్కాలిక మార్గాలు ఏర్పాటు చేయడంతో అత్యవసర వాహనాలు, సేవల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం.