తమ్మినేని కృష్ణయ్య అంతిమ యాత్ర ప్రారంభం.. టీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగింది?

|

Aug 16, 2022 | 11:00 AM

Tammineni Krishnaiah Murder Case Updates: టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి ఉలిక్కపడింది. సోమవారం గ్రామంలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న కొద్దిగంటల్లోనే కృష్ణయ్య కిరాతకంగా హత్యకు గురయ్యాడు.

తమ్మినేని కృష్ణయ్య అంతిమ యాత్ర ప్రారంభం.. టీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగింది?
Tammineni Krishnaiah
Follow us on

టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి ఉలిక్కపడింది. సోమవారం గ్రామంలో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న కొద్దిగంటల్లోనే కృష్ణయ్య కిరాతకంగా హత్యకు గురయ్యాడు. దీంతో నిన్నటి నుంచి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాసేపటికి క్రితం కృష్ణయ్య అంతిమయాత్ర ప్రారంభమయ్యింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రూరల్‌ మండలంలో 144 సెక్షన్‌ విధించారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అంత్యక్రియల్లో కృష్ణయ్య అనుచరులు, టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతిమ యాత్రలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు.

తమ్మినేని కృష్ణయ్యను రాజకీయ కక్షతోనే దారుణంగా హత్య చేశారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ దగ్గరకు ఎవరు వచ్చిన బెదిరించేవారని…మూడేళ్ల కిందట ఎంపీటీసీగా గెలవడం వల్లే కక్ష పెంచుకున్నారని….తమ్మినేని వీరభద్రం, ఆయన సోదరుడు కోటేశ్వరరావు కలిసి చంపించారని  కృష్ణయ్య భార్య మంగతాయి ఆరోపించారు. తమ్మినేని కృష్ణయ్య కూతురు రజిత కూడా ఇదే ఆరోపణ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ హత్య చేయించారని ఆరోపించారు.

అసలు హత్య వెనుక ఏం జరిగింది? కమ్యూనిస్టు కోటలో మళ్లీ ఎందుకు నెత్తురు పారింది? 20 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ హత్యతో గ్రామంలో ఎందుకు కలకలం రేగింది? ఈ విషయాలు ఒక్కసారి చూస్తే…. తెల్దారుపల్లి సీపీఎం పార్టీ కంచుకోట. ఆ పార్టీ రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంతూరు. దాదాపు 30 ఏళ్లుగా ఇక్కడ మరో పార్టీ జెండా ఎగరనీయలేదు. 2001లో గ్రామానికి చెందిన వెంకటయ్య టీడీపీలో చేరారు. ఆ పార్టీ దిమ్మె కట్టి జెండా ఎగురవేశారు. కొద్దిరోజుల్లోనే వెంకటయ్య హత్యకు గురయ్యారు. తర్వాత గ్రామంలో టీడీపీ జెండా, దిమ్మె కనిపించలేదు.

గతంలో ఎప్పుడు సర్పంచి, ఎంపీటీసీ ఎన్నికలు జరిగినా ఏకగ్రీవంగానే ఎన్నుకునేవారు. గత సర్పంచి ఎన్నికల్లో తమ్మినేని కోటేశ్వరరావు సీపీఎం తరపున నామినేషన్‌ వేయడంతో కృష్ణయ్య కూడా నామినేషన్‌ వేశారు. దీంతో పార్టీ నేతలు రంగంలోకి దిగి ఇద్దరినీ కాదని…. సిద్దినేని కోటయ్యను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సర్పంచ్‌ ఎన్నికల్లో ఛాన్స్‌ ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందిన తమ్మినేని కృష్ణయ్య సీపీఎం నుంచి బయటకు వచ్చారు. ఎంపీటీసీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా తన భార్యని పోటీలోకి దింపారు. గ్రామంలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఎం ఓడిపోయింది. తర్వాత కృష్ణయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. గ్రామంలో గులాబీ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ పరిస్థితుల్లోనే సీపీఎం-కృష్ణయ్య వర్గాల మధ్య చాలా సార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్‌ నుంచి తమ్మినేని వీరభద్రం ఫ్యామిలీతో కృష్ణయ్యకు రాజకీయంగా విభేదాలు ఉన్నాయని చెబుతున్నారు.

కృష్ణయ్యను హత్య చేసిన దుండగుల పేర్లను  ప్రత్యక్షసాక్షి, కృష్ణయ్య అనుచరుడు ముత్తెశం వెల్లడించాడు. హత్యలో పాల్గొన్న ఆరుగురిలో నలుగురి పేర్లను చెప్పాడు. తమ్మినేని కోటేశ్వరావు, CPM వాళ్లే హత్య చేశారని తెలిపాడు. రాజకీయంగా ఎదురుకోలేకే హత్య చేశారని తెలిపాడు. తమ్మినేని కృష్ణయ్య హత్య ఘటనపై ఖమ్మం రూరల్ పీఎస్‌లో కృష్ణయ్య కొడుకు నవీన్ ఫిర్యాదు చేశాడు. ఎనిమిది మందిపై ఫిర్యాదు చేసిన కుమారుడు.. రాజకీయ కారణాలతోనే హత్య చేసినట్లు పిర్యాదులో పేర్కొన్నాడు. తమ్మినేని కోటేశ్వరరావు, రంజాన్, జక్కంపూడి కృష్ణ… నూకల లింగయ్య, గజ్జి కృష్ణస్వామి, బోడ పట్ల శ్రీను, ఎల్కంపల్లి నాగయ్యలపై ఫిర్యాదు చేశాడు నవీన్.

కృష్ణయ్య హత్య విషయం తెలుసుకున్న చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. హత్య వెనుక సీపీఎం నేతల హస్తం ఉందని ఆందోళనకు దిగారు. తమ్మినేని కోటేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. కోటేశ్వరరావు గ్రానైట్‌ క్వారీలోకి దూసుకెళ్లి జేసీబీకి నిప్పుపెట్టారు. ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. అదనపు బలగాలను మోహరించి గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పోలీసు కమిషనర్‌ విష్ణు పరిస్థితిని సమీక్షించారు. ఖమ్మం రూరల్‌ మండలంలో 144 సెక్షన్ విధించారు.

రాజకీయ కారణాలతోనే తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగిందని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. తమ్మినేని వీరభద్రం అన్నదమ్ములపైనే కృష్ణయ్య కుటుంబం ఆరోపణలు చేస్తోంది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆయన తమ్ముడు కోటేశ్వరరావులను అరెస్ట్‌ చేయించాలని డిమాండ్‌ చేస్తోంది. హత్య జరిగిన తర్వాత తమ్మినేని కోటేశ్వరరావు ఇల్లు, ఆస్తులపై దాడులు జరిగాయి. కోటేశ్వరరావు ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు కృష్ణయ్య అనుచరులు. ఆయనకు చెందిన జేసీబీని తగులబెట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి..