
ఆకాశంలో సగం.. అవకాశం సగం.. అన్నింటా సగం భాగం.. అంటూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు సత్తా చాటుతున్నారు. దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీక నిలుస్తూ.. ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారు. ‘మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షి అయినా ఒక రెక్కతో ఎగరలేదు’ అన్న స్వామి వివేకానంద మాటలు మరోసారి స్మరిస్తూ.. మారుమూల తండాలో పుట్టి, పెరిగిన గిరిజన బిడ్డ.. ప్రగతి రథం స్టీరింగ్ చేతపట్టి చరిత్ర సృష్టించింది. దేశంలోనూ, తెలంగాణలోనూ తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్‌గా రికార్డులకేక్కింది. ఇటీవలే ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ నుంచి తెలంగాణ ఆర్టీసీలో చేరింది. తొలిరోజు ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపి శభాష్ అనిపించుకుంది. ఆ గిరిజన తేజం ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో సీత్యా తండాకు చెందిన వాంకుడోతు రాంకోటి, రుక్కా దంపతులకు ఆరుగురు సంతానం. ఐదో సంతానమే సరిత. నలుగురు ఆడపిల్లల పెళ్ళికి ఉన్న మూడు ఎకరాల భూమిని అమ్మేశాడు రాంకోటి. కుటుంబ పోషణకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేందుకు సరిత తొలుత ఆటో డ్రైవర్‌గా మారింది. ఆకతాయిల అల్లరి ఎక్కువ కావడంతో తన ఆహార్యాన్ని మార్చేసుకుంది. జుట్టు కత్తిరించుకుని ప్యాంటు, షర్టు ధరించి మగరాయుడిలా తయారైంది. ఐదేళ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యాతండా వరకు ఆటో నడిపింది.
ప్రైవేట్‌గా 10వ తరగతి పాసైన సరిత, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. అనంతరం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుంది. ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో సరిత ఢిల్లీకి వెళ్లి కొన్నాళ్లు కారు నడిపింది. 2015లో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (డీటీసీ)లో బస్సు డ్రైవర్‌గా సరిత సెలక్ట్ అయ్యింది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టులో సరిత ఒక్కరే మహిళా డ్రైవర్. దేశంలోనే అత్యధిక వాహనాల రద్దీ కలిగిన ఢిల్లీలో 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపింది. మొట్ట మొదటి మహిళా బస్సు డ్రైవర్ గా చరిత్ర సృష్టించిన సరిత, 2018లో రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం అందుకుంది. అంతకు ముందు 2017లో తెలంగాణ ప్రభుత్వం తరపున కుమ్రం భీం అవార్డును కూడా సరిత అందుకుంది. దేశంలోని ప్రముఖ సంస్థలు, వ్యక్తుల నుండి ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది.
ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లో పనిచేసిన సరితకు 18 వేల రూపాయల నెలసరి వేతనం సరిపోలేదు. మరోవైపు తల్లిదండ్రులు వృద్ధాప్యంతో ఉండడంతో తిరిగి సొంతూరు తండాకు చేరుకుంది. స్థానికంగా ఉపాధి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో టీవీ9 చొరవతో ప్రజాదర్బార్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సరిత కలిసింది. తెలంగాణ ఆర్టీసీలో ఉపాధి కల్పించాలని వేడుకుంది. స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లకు వీడియో కాల్ చేసి దేశంలోనే తొలి మహిళా బస్సు డ్రైవర్ సరితకు ఉపాధి కల్పించాలంటూ కోరారు. మంత్రి కోమటిరెడ్డి సిఫార్సు మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో టీఎస్‌ఆర్‌టీసీలో ఉద్యోగం సంపాదించింది. దీంతో అధికారులు ఆమెకు హైదరాబాద్ డిపోలో పోస్టింగ్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్‌గా చేరి.. తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా రికార్డు సొంతం చేసుకుంది. ఆమె ఎంజీబీఎస్ నుంచి మిర్యాలగూడ వరకు నాన్‌స్టాప్ బస్సు నడిపారు.
ఢిల్లీలో కన్నా సొంత రాష్ట్రంలో పని చేయడం సంతోషంగా ఉందని సరిత చెబుతోంది. తనకు డ్రైవర్‌గా అవకాశం కల్పించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. తన ఉపాధి కోసం చొరవ తీసుకున్న టీవీ9 కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది. ప్రస్తుతం హైదరాబాద్ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నానని, తెలంగాణలో తొలి మహిళా డ్రైవర్ గా రికార్డులు ఎక్కడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళా కండక్టర్ల సేవలను చూశాం కానీ, తొలి తెలంగాణ మహిళ ఆర్టీసీ డ్రైవర్ గా సరిత సేవలు చాలా బాగున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. సరితకు మహిళా ఆర్టీసీలో డ్రైవర్ గా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ప్రయాణికులు ధన్యవాదాలు చెబుతున్నారు. సరిత చాలా బాగా డ్రైవింగ్ చేస్తోందని ప్రయాణికులు చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..