దారుణం.. వేపచెట్టు వివాదంలో ఇద్దరి హత్య.. అడ్డొచ్చిన ఎస్‌ఐని వదలని దుండగులు!

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 25 ఏళ్లుగా కొనసాగుతున్న వేపచెట్టు వివాదం చివరకు రెండు ప్రాణాలను బలితీసుకుంది. మేళ్లచెరువు మండలం ఎర్రగట్టుతండాలో ఇద్దరిని గొడ్డలితో హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సైపై కూడా దుండగులు దాడి చేసి గాయపరిచారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

దారుణం.. వేపచెట్టు వివాదంలో ఇద్దరి హత్య.. అడ్డొచ్చిన ఎస్‌ఐని వదలని దుండగులు!
Neem Tree Dispute

Updated on: Aug 29, 2026 | 1:32 PM

సూర్యాపేట: చిన్న వేపచెట్టు విషయంలో ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం చివరకు రెండు ప్రాణాలను బలితీసుకుంది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగట్టుతండాలో శనివారం (ఆగస్టు 29) ఉదయం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు గొడ్డలితో దాడికి గురై మృతి చెందారు. ఈ ఘటనను అదుపు చేసేందుకు వెళ్లిన ఎస్సై నవీన్‌కుమార్‌పై కూడా దుండగులు దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

25 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం

స్థానికుల కథనం ప్రకారం.. ఇంటి సరిహద్దులో ఉన్న వేపచెట్టు విషయంలో అమరబోయిన వెంకటేశ్వర్లు, భూక్యా సైదా కుటుంబాల మధ్య గత 25 ఏళ్లుగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం వెంకటేశ్వర్లు కొంతమందిని పిలిపించి వేపచెట్టును నరికించారు. ఈ విషయం గమనించిన భూక్యా సైదా కుమారుడు రాము అక్కడికి వెళ్లి చెట్టు విషయంలో ఇన్నేళ్లుగా వివాదం కొనసాగుతుండగా ఎలా నరికిస్తారని ప్రశ్నించాడు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో భూక్యా రాము గొడ్డలితో వెంకటేశ్వర్లుపై దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

తండ్రిపైనా గొడ్డలితో దాడి

వెంకటేశ్వర్లుపై దాడిని అడ్డుకునేందుకు భూక్యా సైదా అక్కడికి వెళ్లినట్లు సమాచారం. అయితే రాము తన తండ్రిపైనా గొడ్డలితో దాడి చేయడంతో సైదా కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసును పక్కదారి పట్టించేందుకు తన తండ్రిపైనా రాము దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఎస్సైపై దాడి.. తీవ్ర గాయాలు

ఇద్దరి మృతితో ఆగ్రహించిన గ్రామస్థులు రాము ఇంటిపై రాళ్ల దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎర్రగట్టుతండాకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కొందరు దుండగులు మేళ్లచెరువు ఎస్సై నవీన్‌కుమార్‌పై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎస్సై తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి హత్యలకు కారణమైన భూక్యా రామును అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఓ చిన్న భూవివాదం రెండు హత్యలకు, పోలీసు అధికారిపై దాడికి దారితీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us