రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం కలిగించిన ఇందు అనుమానాస్పద మృతి కేసును పోలీసులు తేల్చారు. మిస్టరీని ఛేదించారు. టాయిలెట్ కోసం చెరువు వద్దకు వెళ్లిన చిన్నారి.. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయినట్లు తేల్చారు. ఆడుకోవటానికి వచ్చిన ఇందు చెరువు వద్దకు వెళ్లడంతో ఈ దుర్ఘటన జరిందని చెప్పారు. గాంధీ ఫోరెన్సిక్ టీం పోస్ట్ మార్టం నేవేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివరాలు వెల్లడించారు. ఇందు మిస్ అయిన మరుసటి రోజు నీటిలో పడినట్టు రిపోర్ట్ ద్వారా నిర్ధారణ అయింది. అయితే ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అక్కడ గంజాయి బ్యాచ్ కదలికలు ఎక్కువగా ఉండటం, అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు గంజాయి బ్యాచ్ లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బాలిక తల్లిదండ్రుల మొబైల్ ఫోన్స్ పై పోలిసుల ఫోకస్ పెట్టారు.
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పదేళ్ల ఏళ్ల చిన్నారి మిస్సింగ్ ఘటన సంచలనంగా మారింది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా బాలిక చెరువు వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు మృతదేహన్ని కనుగొన్నారు. ఇందు మృతిపై బాలిక తల్లిదండ్రులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంజాయి బ్యాచ్ తమ పాపను ఏదైనా చేయకూడనిది చేసి దమ్మాయిగూడ చెరువులో పడేసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఈ కేసు విచారణ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలిక మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. బాలిక రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. దీని ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా.. ఎట్టకేలకు దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం లభించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..