తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న అక్కసుతో రూ.80 లక్షల విలువైన స్పోర్ట్స్ కారును కాల్చి బూడిద చేశారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నార్సింగ్ ప్రాంతానికి చెందిన నీరజ్ అనే వ్యాపారి రూ.4 కోట్ల విలువ కలిగిన లంబోర్ఘి అనే స్పోర్ట్స్ కారును సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేశాడు. ఆ కారుపై మోజు తీరడంతో అమ్మేలానుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే తనకు పరిచయస్తుడైన అయాన్ అనే వ్యక్తికి కారు విక్రయించే బాధ్యతను అప్పగించాడు. దీంతో అయాన్ తన స్నేహితుడైన హైదరాబాద్ పాతబస్తీ మొఘల్‌పురా ప్రాంతానికి చెందిన అమన్‌ను సంప్రదించాడు. దీంతో కారు కొనేందుకు పార్టీ రెడీగా ఉందని అమన్‌కు అతని మిత్రుడు అహ్మద్ తెలిపాడు. కారును చూసుకునేందుకు మామిడిపల్లి నుంచి శంషాబాద్ వెళ్ళే దారిలో ఉన్న తన ఫాం హౌజ్‌కు తీసుకురావాలని అహ్మద్ చెప్పాడు. నీరజ్ దగ్గర నుంచి అయాన్ కారు తీసుకువచ్చి అమన్‌కు ఇచ్చాడు.
అమన్ అతని స్నేహితుడు హందాన్‌తో కలిసి జల్పల్లిలో ఆ స్పోర్ట్స్ కారును తీసుకుని మామిడిపల్లిలోని వివేకానంద విగ్రహం ఎయిర్ పోర్ట్ రూట్ మధ్యలో ఆపారు. అహ్మద్‌తో పాటు మరి కొంత మంది కారు వద్దకు చేరుకుని, కారు అసలు ఓనర్ నీరజ్ గురించి ఆరా తీశారు. అతను మాకు డబ్బులు ఇవ్వాలని దుర్భాషలాడారు. నీరజ్‌ను పిలిపిస్తామని చెప్పిన వినకుండా అహ్మద్ వెంట వచ్చిన వ్యక్తులు, బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్‌ను స్పోర్ట్స్ కారుపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అమన డయల్100 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పహాడీషరీఫ్ పోలీసులు, ఫైర్‌ఇంజన్ ఘటనా స్థలికి చేరుకునే లోపే కారు పూర్తిగా దగ్ధమయ్యింది. అమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…