Telangana High Court: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతులు చేపట్టదలచిన ర్యాలీకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఇందిరాపార్క్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ చేపడతామన్న రైతుల ప్రతిపాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఎల్బీనగర్‌లోని సరూర్ నగర్ స్టేడియం నుంచి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించుకోవచ్చు అంటూ రైతులకు ధర్మాసనం సూచించింది. అది కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ర్యాలీ చేపట్టాలని కోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాచకొండ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గణతంత్ర దినోత్సవం రోజైన జనవరి 26వ తేదీన ఢిల్లీలో రైతులు భారీ ట్రాక్టర్ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ ర్యాలీకి మద్దతుగా ఆల్ ఇండియా కిసాన్ సంఘర్షణ్ కో ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనూ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. అయితే రైతుల ర్యాలీకి పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో ఆల్ ఇండియా కిసాన్ సంఘర్షన్ కో ఆర్డినేషన్ కమిటీ నాయకురాలు పశ్యా పద్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. రైతుల ర్యాలీకి అనుమతిని ఇచ్చారు.
Also read:
CM YS Jagan: పంచాయతీ ఎన్నికలపై అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ.. కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం..