
తెలంగాణలో రోజురోజుకూ బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో స్ట్రోక్ బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించాల్సిన పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో 108 అంబులెన్స్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈఎంఆర్‌ఐ) అధ్యయనం ప్రకారం.. 2025లో 108 సేవల పరిధిలోకి వచ్చిన స్ట్రోక్ అత్యవసర కేసులు 5,298. అంటే రోజుకు సగటున 15 మంది ఈ సమస్యతో ఆసుపత్రులకు చేరాల్సి వచ్చింది. బాధితుల్లో మహిళలతో పోలిస్తే పురుషుల వాటా ఎక్కువగా ఉంది. స్ట్రోక్ కేసుల నమోదులో జిల్లాల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. కరీంనగర్‌లో అత్యధికంగా 319 కేసులు నమోదు కాగా, ఖమ్మం 279 కేసులతో, రంగారెడ్డి 264 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కుమురంభీం ఆసిఫాబాద్‌లో 51 కేసులు, వికారాబాద్‌లో 55, నారాయణపేటలో 57 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో బాధితులు ఎక్కువగా ఉండే అవకాశమున్నప్పటికీ, 108 గణాంకాల్లో ఆ స్థాయి సంఖ్య కనిపించకపోవడానికి ప్రైవేట్ అంబులెన్స్‌ల వినియోగం కూడా ఒక కారణమై ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈఎంఆర్‌ఐ సేకరించిన వివరాల ప్రకారం.. మొత్తం బాధితుల్లో 3,356 మంది పురుషులు కాగా, 1,942 మంది మహిళలు ఉన్నారు. వీరిలో పురుషులు 63.35 శాతం, మహిళలు 36.65 శాతంగా ఉన్నారు. బాధితుల సగటు వయస్సు 59 సంవత్సరాలుగా నమోదైంది. 60 ఏళ్లు దాటిన వారు మొత్తం కేసుల్లో 43 శాతం ఉన్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో స్ట్రోక్ అత్యవసర కేసుల సంఖ్య అధికంగా ఉంది. నమోదైన కేసుల్లో 3,780 పట్టణ ప్రాంతాలకు చెందినవి. గ్రామీణ ప్రాంతాల నుంచి 1,191 కేసులు రాగా, గిరిజన ప్రాంతాల నుంచి 327 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సగటున 160 కేసులు నమోదైనట్లు అధ్యయనం వెల్లడించింది.
మెదడులో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు అక్కడి కణాలకు ఆక్సిజన్, పోషకాలు అందవు. దీంతో మెదడు కణజాలం వేగంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతి నిమిషం ఆలస్యం జరిగినా నష్టం పెరిగే అవకాశం ఉండటంతో, స్ట్రోక్‌ను వైద్య అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ సమయంలో నిమిషానికి సుమారు 19 లక్షల నాడీకణాలు నశించవచ్చు. తెలంగాణలో 108 అంబులెన్స్ సేవలు సగటున 11 నిమిషాల్లో స్పందిస్తున్నట్లు ఈఎంఆర్‌ఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ స్పందన సమయం 15 నిమిషాల్లోపు ఉంటున్నట్లు సంస్థ పేర్కొంది. అత్యవసర సిబ్బంది వేగంగా చేరుకోవడం వల్ల బాధితుడికి ప్రాథమిక సహాయం అందించి, మెరుగైన చికిత్స అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంటుంది. 108 ద్వారా ఆసుపత్రులకు తరలించిన స్ట్రోక్ బాధితుల్లో 77 శాతం మందిని ద్వితీయ, తృతీయ స్థాయి వైద్య సదుపాయాలున్న కేంద్రాలకు తీసుకెళ్లారు.
బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలను వెంటనే గుర్తించడం చాలా ముఖ్యం. కింది మార్పుల్లో ఏదైనా అకస్మాత్తుగా కనిపిస్తే అత్యవసర వైద్య సేవలను సంప్రదించాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే తగ్గుతాయేమోనని వేచి చూడకుండా వెంటనే 108కు ఫోన్ చేయాలి. లక్షణాలు మొదలైన సమయాన్ని గుర్తుంచుకోవాలి. వైద్యుల సూచన లేకుండా మందులు ఇవ్వకూడదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.