
తెలంగాణ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పు రాబోతోంది. ఇప్పటివరకు సొంత ఐటీ వ్యవస్థతో నెట్టుకొచ్చిన తెలంగాణ రవాణా శాఖ, ఇప్పుడు జాతీయ నెట్‌వర్క్‌లో భాగం కానుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే లైసెన్సుల కోసం సారథిని ప్రవేశపెట్టగా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం వాహన్ పోర్టల్‌ను అనుసంధానిస్తోంది. దీనివల్ల వన్ నేషన్ – వన్ రిజిస్ట్రీ కల సాకారం కానుంది. అటు వాహనదారులకు దశాబ్దాల నాటి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ముఖ్యంగా రాష్ట్రాలు దాటి వాహనాలు కొనుగోలు చేసేవారికి ఇది అతిపెద్ద ఊరట. గతంలో ఇతర రాష్ట్రాల నుండి వాహనం తెచ్చుకున్నా లేదా ఇక్కడి వాహనాన్ని వేరే రాష్ట్రానికి తీసుకెళ్లాలన్నా NOC కోసం ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై డేటా అంతా కేంద్ర సర్వర్‌లో ఉండటం వల్ల ఈ ప్రక్రియ సెకన్ల వ్యవధిలో ఆన్‌లైన్‌లోనే పూర్తవుతుంది.
మీరు సెకండ్ హ్యాండ్ వాహనం కొంటున్నారా? అయితే ఈ మార్పు మీకోసమే. వాహనంపై ఎన్ని చలాన్లు ఉన్నాయి..? గతంలో ఏవైనా క్రైమ్ రికార్డులు ఉన్నాయా..? అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ఇంజిన్, ఛాసిస్ నంబర్లను నేరుగా పోర్టల్‌లో సరిచూసుకోవచ్చు. తద్వారా మోసాలకు అడ్డుకట్ట పడుతుంది.
ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్ల బెడద, క్యూ లైన్ల ఇబ్బంది ఇక ఉండదు. డూప్లికేట్ ఆర్సీ, అడ్రస్ మార్పు, హైపోథికేషన్ రద్దు వంటి పనులను నేరుగా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు.ఫిజికల్ డాక్యుమెంట్లు వెంట ఉంచుకోక్కర్లేదు. డిజీ లాకర్ లేదా ఎం-పరివాహన్ యాప్‌లోని డిజిటల్ ఆర్సీ చెల్లుబాటు అవుతుంది.
వాహన దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఈ పోర్టల్ పోలీసులకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. తెలంగాణలో దొంగిలించిన వాహనాన్ని ఇతర రాష్ట్రాల్లో విక్రయించడానికి ప్రయత్నిస్తే.. జాతీయ నెట్‌వర్క్ వల్ల ఆ వాహన గుర్తింపు వెంటనే తెలిసిపోతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.