తొమ్మిదేళ్లు జైల్లోనే.. చివరకు నిర్దోషిగా విడుదల.. మహిళ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు!

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిజామాబాద్‌లో 2017లో జరిగిన హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రాజస్థాన్‌కు చెందిన వలస కార్మికుడు మంగీలాల్‌కు విధించిన శిక్షను రద్దు చేస్తూ విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. అభియోగాలను సందేహాతీతంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొన్న హైకోర్టు, నిందితుడికి అనుమాన లాభం (Benefit of Doubt) వర్తిస్తుందని స్పష్టం చేసింది.

తొమ్మిదేళ్లు జైల్లోనే.. చివరకు నిర్దోషిగా విడుదల.. మహిళ హత్య కేసులో హైకోర్టు సంచలన తీర్పు!
Murder Accused Acquitted

Edited By:

Updated on: Jun 03, 2026 | 3:33 PM

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నిజామాబాద్‌లో 2017లో జరిగిన హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న రాజస్థాన్‌కు చెందిన వలస కార్మికుడు మంగీలాల్‌కు విధించిన శిక్షను రద్దు చేస్తూ విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. అభియోగాలను సందేహాతీతంగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొన్న హైకోర్టు, నిందితుడికి అనుమాన లాభం (Benefit of Doubt) వర్తిస్తుందని స్పష్టం చేసింది.

జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ బీఆర్ మధుసూదన్ రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ తీర్పును వెలువరించింది. దాదాపు తొమ్మిదేళ్లుగా జైలులో ఉన్న మంగీలాల్ అనే నిందితుడు దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన కోర్టు, ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను రద్దు చేసింది. ఇతర కేసుల్లో అవసరం లేకపోతే వెంటనే విడుదల చేయాలని జైలు అధికారులను ఆదేశించింది.

మంగీలాల్ తన యజమాని వద్ద పనిచేస్తున్న సమయంలో అతని భార్యపై లైంగిక వేధింపులకు ప్రయత్నించాడని కేసు నమోదు అయ్యింది. యజమాని భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతో, ఆమె ప్రతిఘటించి భర్తకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించడంతో కోపోద్రిక్తుడై రోకలి బండతో తలపై దాడి చేసి హత్య చేశాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ ఘటనలో మహిళ తీవ్ర గాయాలతో మృతి చెందడంతో పోలీసులు మంగీలాల్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరని, మొత్తం కేసు పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలపైనే ఆధారపడిందని హైకోర్టు పేర్కొంది.

పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలు ఒకదానితో ఒకటి పూర్తిస్థాయిలో అనుసంధానమై, నిందితుడే నేరస్థుడని స్పష్టంగా నిరూపించాల్సి ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. రికార్డులను పరిశీలించిన ధర్మాసనం.. నిందితుడిపై ఉన్న అనుమానాలను సందేహాతీతంగా నిరూపించలేకపోయిందని తేల్చింది. ఈ నేపథ్యంలో మంగీలాల్‌కు అనుమాన లాభం కల్పిస్తూ శిక్షను రద్దు చేసి విడుదలకు ఆదేశాలు జారీ చేసింది. 2017 ఏప్రిల్ 28 నుంచి జైలులో ఉన్న మంగీలాల్‌కు ఈ తీర్పుతో దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత స్వేచ్ఛ లభించినట్లైంది. హత్య కేసుల్లో పరిస్థితుల ఆధారిత సాక్ష్యాల ప్రాముఖ్యతను మరోసారి గుర్తు చేసేలా ఈ తీర్పు ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us