
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు శుభవార్త అందించింది. ఇక నుంచి వారికి పాలు కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని వీరికి అమలు చేస్తోండగా.. తాజాగా పాలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పాలు సరఫరా చేసే బాధ్యతలను విజయ డెయిరీ సంస్థకు అప్పగించింది. 1వ తేదీ నుంచి ఇంటర్ వరకు చదువుకునే పిల్లలకు వీటిని ఇవ్వనున్నారు. ఇందుకోసం విజయ డెయిరీకి పాల కోసం కూ.120 కోట్ల ఆర్డర్ ప్రభుత్వం ఇచ్చింది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పాలు అందించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
రానున్న విద్యాసంవత్సరం జూన్ నుంచే పాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యాశాఖను సీఎం రేవంత్ తన వద్దే ఉంచుకున్నారు. దీంతో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులు పౌష్టికాహారలోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తున్నారు. ఇప్పుడు మరింత పోషకాలు ఉండే ఆహారం అందించేందుకు పాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. 2026-27 విద్యాసంవత్సరం మొదలుకానున్న జూన్ నుంచి ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ బ్రేక్ ఫాస్ట్‌లో పాలు కూడా అందించనున్నారు.
టెట్రాప్యాకెట్లలో పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు నిత్యం 150 మిల్లీలీటర్ల నుంచి 200 మిల్లీలీటర్ల వరకు పాలు అవసరమని జాతీయ పోషకాహార సంస్థ చెబుతోంది. దీంతో ఆ మోతాదులో పాలను టెట్రాప్యాకెట్లలో విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. పాలు సరఫరాకు సంబంధించి విజయ డెయిరీ నుంచి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు కోరగా.. పాలను సరఫరా చేసేందుకు విజయ డెయిరీ ముందుకొచ్చింది. ఇప్పటికే అంగన్ వాడీల్లోని పిల్లలకు విజయ డెయిరీ పాలను అందిస్తోంది. 3 నుంచి 5 ఏళ్ల చిన్నారులకు టెట్రాప్యాకెట్లలో పాలను పంపిణీ చేస్తోంది. 100 మిల్లీలీటర్ల పాలను అందిస్తున్నారు. ఇప్పుడు అదే విధానంలో స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా అందించనున్నారు. కాగా మధ్యాహ్న భోజన పథకంలో చేపల కూరను కూడా అందించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మెనూలో దానిని చేర్చింది. పిల్లలకు ఆరోగ్యకరమైన భోజనం అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మెనూలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కొత్త పదార్ధాలను చేర్చుతోంది.