
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ గుడ్ న్యూస్ అందించనుంది. జూన్ 2వ తేదీన కీలక పథకానికి శ్రీకారం చుట్టనుంది. అదే ఇందిరమ్మ జీవిత బీమా పథకం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన ఈ పథకం ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తం అవుతోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు రూ.5 లక్షల బీమా అందించనుంది. రేషన్ కార్డు ఉన్నవారందరికీ ఈ పథకం వర్తించనుంది. కుటుంబ యజమాని మరణిస్తే కుటుంబసభ్యులకు రూ.5 లక్షల సాయం అందించనుంది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేసేందుకు సిద్దమవుతోంది.
ఇందిరమ్మ జీవిత బీమా పథకం అమలు చేసేందుకు జూన్ 2న ఎల్‌ఐసీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకునే అవకాశముందని తెలుస్తోంది. గతంలో ఆ స్కీమ్ గరించి మీడియా సమావేశంలో రేవంత్ వెల్లడించారు. జూన్ 2 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. త్వరలో గడువు తేదీ దగ్గర పడుతుండటంతో పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. దీంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించనుంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్త పింఛన్లను అందించలేదు. దీంతో 2 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందించాలని ప్రభుత్వం చూస్తోంది. పింఛన్ పెంపుపై కూడా ఓ నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రెండో దశ ఇళ్ల మంజూరుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రెండో దశలో చేపట్టనున్న ఇళ్ల నిర్మాణాలకు జూన్ 2వ తేదీ నుంచి నిధులు విడుదల చేయనుంది. అంతేకాకండా అదే రోజున మరో కార్యక్రమం కూడా చేపట్టనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబసభ్యులు డిజిటల్ హెల్త్ కార్డులను అందించనున్నారని తెలుస్తోంది. ఈ కార్డులతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ అమలు చేసేందుకు ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే కార్డులను జారీ చేసేందుకు డేటాను కూడా సేకరించింది. మే 31లోగా డేటా సేకరణ ప్రక్రియ పూర్తి కానుంది. ఇక జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభం, నిరుద్యోగ యువతకు విదేశాల్లో ఉపాధి పొందేలా శిక్షణ వంటి కార్యక్రమాలు ప్రారంభించనుంది.