
తెలంగాణలో సొంతింటి కల నెరవేర్చుకున్నప్పటికీ, ఆ ఇంటికి సంబంధించిన అసలు పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దాదాపు పదేళ్లుగా అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులకు వారి ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు తిరిగి అందించాలని రేవంత్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
అసలు సమస్య ఏంటి?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014కు ముందు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్ప, వాంబే తదితర పథకాల ద్వారా ప్రభుత్వం పేదలకు ఇళ్లను మంజూరు చేసింది. కొన్ని పథకాలలో లబ్ధిదారుల వాటాతో పాటు బ్యాంకు రుణాల సహకారంతో నిర్మాణాలు చేపట్టారు. ఈ సమయంలో రుణాలకు భద్రతగా పలువురి ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను అధికారులు తీసుకున్నారు. అయితే రుణాలు చెల్లించిన తర్వాత కూడా చాలామందికి వారి అసలు పత్రాలు తిరిగి అందలేదు. దీంతో ఇళ్లను విక్రయించుకోవాలన్నా, బ్యాంకుల నుంచి కొత్త రుణాలు పొందాలన్నా, కుటుంబ సభ్యులకు వారసత్వంగా బదిలీ చేయాలన్నా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సొంత ఇల్లు ఉన్నా చేతిలో పత్రాలు లేకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఈ సమస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సెక్షన్ 22ఏ భూములపై జరిగిన సమీక్షలో పాత గృహ నిర్మాణ పథకాలకు సంబంధించిన అసలు పత్రాలు ఇంకా తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అర్హులైన లబ్ధిదారులకు వాటిని తిరిగి అప్పగించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ సూచనలు
ఈ మేరకు రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు సంబంధిత లబ్ధిదారులను గుర్తించి, వారి ఒరిజినల్ ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి అందించే చర్యలు చేపట్టాలి. రుణాలు చెల్లించిన అర్హులైన కుటుంబాలకు పత్రాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం సూచించింది.
త్వరలో పంపిణీ షెడ్యూల్
దాదాపు 7 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాల పంపిణీ షెడ్యూల్ను ప్రభుత్వం వెల్లడించాల్సి ఉంది. అధికారిక మార్గదర్శకాలు, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత పంపిణీపై స్పష్టత రానుంది.
మొత్తానికి పదేళ్లుగా తమ ఇంటి అసలు పత్రాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. ఇకనైనా తమ ఇళ్లపై పూర్తి హక్కులకు సంబంధించిన పత్రాలు చేతికి అందుతాయని లక్షలాది మంది ఆశగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..