
తెలంగాణలో జరగనున్న గోదావరి పుష్కరాలను మరింత ప్రత్యేకంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పుష్కరాల ప్రత్యేకతను ప్రతిబింబించేలా అధికారిక లోగో, ట్యాగ్‌లైన్ రూపొందించేందుకు ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు పోటీల నిర్వహణపై ప్రకటన జారీ చేసింది. గోదావరి నది చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక విశిష్టతతోపాటు పుష్కరాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని సూచించింది. ఆసక్తి ఉన్నవారు తెలుగు, ఆంగ్ల భాషల్లో లేదా రెండు భాషల్లోనూ తమ ప్రతిపాదనలు పంపించవచ్చు. ఉత్తమంగా ఎంపికైన మూడు ఎంట్రీలకు నగదు బహుమతులు అందించనున్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, రెండో విజేతకు రూ.50 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నారు. మరో 100 మందికి ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. పోటీలకు సంబంధించిన పూర్తి వివరాలను https://endowments.ts.nic.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు.
గోదావరి పుష్కరాలకు దాదాపు 8 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ జనసందోహానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. పుష్కరాల సన్నద్ధత, వివిధ శాఖల మధ్య సమన్వయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజూ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భక్తుల రాక, అవసరమైన ఏర్పాట్లు, చేపట్టాల్సిన పనులపై సీఎస్‌కు నివేదిక అందించారు.
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 67 ప్రాంతాలను గుర్తించినట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ వెల్లడించారు. ఆయా ప్రాంతాలకు వచ్చే భక్తుల సంఖ్య, ప్రాధాన్యాన్ని బట్టి మూడు విభాగాలుగా వర్గీకరించినట్లు తెలిపారు. ప్రతి ప్రాంతంలో అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వివరించారు.
2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో పనుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని సీఎస్ అధికారులకు స్పష్టం చేశారు. ఘాట్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతోపాటు ఇంజినీరింగ్ పనులన్నింటినీ నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావుతోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
పుష్కరాల నేపథ్యంలో గోదావరి నది ప్రవహించే తెలంగాణ ప్రాంతాల్లో భక్తులకు సౌకర్యవంతమైన స్నానఘట్టాలు అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం జిల్లాలతోపాటు నది పరివాహక ప్రాంతాల్లో కొత్త ఘాట్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న వాటి అభివృద్ధి పనులు చేపడుతోంది. ఈ మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం సుమారు రూ.వెయ్యి కోట్ల నిధులు కేటాయించింది. పుష్కరాలకు ముందే నిర్మాణ పనులు పూర్తి చేసి భక్తులకు అవసరమైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..