Telangana: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెల నుంచి పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. ఎంతంటే..?

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలపై రూ.5,420 కోట్ల అదనపు భారాన్ని మోపుతూ.. ట్రూఅప్ ఛార్జీల రూపంలో వసూలు చేయనుంది. నవంబర్ నెల నుండి యూనిట్‌కు 30 పైసలు అదనంగా వసూలు చేయనుందని తెలుస్తోంది.

Telangana: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెల నుంచి పెరగనున్న విద్యుత్ ఛార్జీలు.. ఎంతంటే..?
Power Charges

Updated on: Oct 08, 2026 | 9:35 PM

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల అదనపు భారాన్ని మోపాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని ట్రూ అప్ ఛార్జీల రూపంలో ప్రజల నుండి వసూలు చేయనున్నారు. రాష్ట్రంలోని డిస్కంలు నష్టపోయిన ఈ మొత్తాన్ని భర్తీ చేసేందుకు ఈ పెంపును అమలు చేస్తున్నారు. నవంబర్ నెల నుండి ప్రతి యూనిట్ విద్యుత్ వినియోగంపై 30 పైసలు అదనంగా వసూలు చేయనున్నారు. డిసెంబర్ నెల నుండి ఈ అదనపు ఛార్జీ 50 పైసలకు పెరగనుంది. ఈ ట్రూ అప్ ఛార్జీలు రాష్ట్రంలోని రెండు ప్రధాన విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో వేర్వేరు కాలపరిమితులతో అమలులో ఉండనున్నాయి. దక్షిణ తెలంగాణలోని టిజిఎస్‌పిడిసిఎల్ పరిధిలోని వినియోగదారులకు 29 నెలల పాటు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని టిజిఎన్‌పిడిసిఎల్ పరిధిలోని వినియోగదారులకు 26 నెలల పాటు ఈ అదనపు భారం పడనుంది. ఈ కొత్త ఛార్జీలు రాష్ట్రంలోని అందరి వినియోగదారులపై వర్తించవు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న సుమారు 53 లక్షల కుటుంబాలకు ఈ ట్రూ అప్ ఛార్జీల నుండి మినహాయింపు లభించింది.

అయితే 200 యూనిట్లకు మించి విద్యుత్‌ను వినియోగించే కుటుంబాలపైనే ఈ అదనపు భారం పడుతుంది. ప్రస్తుత ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం కూడా 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుందని, కనుక ఈ పెంపు అత్యధిక కుటుంబాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. 2023-24, 2024-25 సంవత్సరాలలో విద్యుత్ సరఫరాకు సంబంధించి డిస్కంలు నష్టపోయిన రూ.5,420 కోట్లను పూడ్చేందుకు ఈ ఛార్జీల పెంపును ప్రభుత్వం అమలు చేస్తోంది. మునుపటి ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలు లేదా ఉచిత విద్యుత్ వంటి పథకాల కారణంగా డిస్కంలకు నష్టం వాటిల్లిందని, ఆ నష్టాన్ని ఇప్పుడు ప్రజల నుండి వసూలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.

అయితే ప్రభుత్వ నిర్ణయంపై మధ్యతరగతి ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ రకాల పన్నులు, ధరల భారంతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడికి ఈ కరెంటు బిల్లుల పెంపు అదనపు భారాన్ని మోపనుంది. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.12,403 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించి డిస్కంలకు చెల్లించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భారాన్ని ప్రజలపై మోపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. ఆధునిక కాలంలో 200 యూనిట్ల విద్యుత్ ఒక సాధారణ ఇంటి అవసరాలకు ఏ మాత్రం సరిపోదని, ఫ్రిజ్, ఫ్యాన్, బల్బులు వంటి వాటిని వాడినా ఆ పరిమితి దాటిపోతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us