ఒక్క బ్యాంక్ అకౌంట్ ఇస్తే చాలు.. మీరు కూడా క్రైమ్‌లో భాగం అయినట్లే.. 

సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌లో వచ్చే ‘బ్యాంక్ అకౌంట్ ఇస్తే కమీషన్’ వంటి ఈజీ మనీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన మల్టీ-స్టేట్ ఆపరేషన్‌లో 18 మంది మహిళలు సహా 101 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

ఒక్క బ్యాంక్ అకౌంట్ ఇస్తే చాలు.. మీరు కూడా క్రైమ్‌లో భాగం అయినట్లే.. 
Shikha Goel, director of the Telangana Cyber Security Bureau

Edited By:

Updated on: Oct 07, 2026 | 6:16 PM

ఒక్క బ్యాంక్ అకౌంట్ ఇస్తే డబ్బులు వస్తాయి.. కమీషన్ తీసుకోండి.. ఈజీ మనీ! సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్‌లో ఇలాంటి మెసేజ్‌లు చూసి చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఇలాంటి చిన్న ఆఫర్లే చివరకు భారీ సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లో భాగం చేసే ప్రమాదం ఉంది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిర్వహించిన భారీ మల్టీ-స్టేట్ ఆపరేషన్ ఇప్పుడు ఇదే విషయాన్ని బయటపెట్టింది. ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో 18 మంది మహిళలు సహా 101 మంది నిందితులు అరెస్టయ్యారు. వీరి ద్వారా సుమారు 17 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సెప్టెంబర్ 23 నుంచి రెండు వారాల పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిలో ఈ ఆపరేషన్ కొనసాగింది. అసలు ఈ నెట్‌వర్క్‌లో ముఖ్యమైన పాత్ర పోషించింది మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్. అంటే.. సైబర్ మోసగాళ్లు తమ పేర్లపై కాకుండా ఇతరుల బ్యాంక్ ఖాతాలను డబ్బులు స్వీకరించడానికి, ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉపయోగించుకోవడం. ఇందుకోసం కొందరు ఏజెంట్లు కమీషన్ తీసుకుని బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు సమకూర్చినట్లు దర్యాప్తులో తేలింది. అరెస్టయిన 101 మందిలో 19 మంది ఏజెంట్లు, 81 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు ఉన్నారు.

అంటే నా అకౌంట్ మాత్రమే కదా.. నేను ఏం చేశాను? అనే నిర్లక్ష్యం ఎంత ప్రమాదకరమో ఈ కేసు చెబుతోంది. అంతేకాదు.. ఈ నిందితుల బ్యాక్‌గ్రౌండ్ చూస్తే సైబర్ క్రైమ్ అంటే కేవలం చదువు లేని వాళ్లు లేదా నిరుద్యోగులే చేస్తారనే అపోహ కూడా తప్పని అర్థమవుతోంది. అరెస్టయిన వారిలో వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు, గృహిణులు, డ్రైవర్లు, సేల్స్-మార్కెటింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఒక టాటా క్యాపిటల్ ఉద్యోగి కమీషన్ కోసం సైబర్ మోసగాళ్లకు మ్యూల్ అకౌంట్లు సమకూర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటుండగా, ఒక ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి తన బ్యాంక్ అకౌంట్‌ను మోసపూరిత లావాదేవీలకు ఉపయోగించేందుకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరో నిందితుడికి దేశవ్యాప్తంగా 50 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఇంకొకరికి 60 కేసులతో సంబంధం ఉన్నట్లు గుర్తించారు. మొత్తం 101 మందిలో 50 మందికి దేశవ్యాప్తంగా ఐదుకు పైగా నేర సంబంధాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. మ్యూల్ అకౌంట్ల ద్వారా వచ్చిన డబ్బును ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేయడం, ఇతర ఖాతాలకు బల్క్ ట్రాన్స్‌ఫర్లు చేయడం, విదేశీ లావాదేవీలకు ఉపయోగించడం వంటి మార్గాల్లో తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పనికి అకౌంట్ హోల్డర్లు, మధ్యవర్తులకు మోసపూరిత మొత్తంలో 5 శాతం వరకు కమీషన్ ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంటే సోషల్ మీడియాలో కనిపించే ‘అకౌంట్ ఇవ్వండి.. కమీషన్ తీసుకోండి’ అనే ఈజీ మనీ ఆఫర్ వెనుక ఎంత పెద్ద నెట్‌వర్క్ ఉండొచ్చో ఊహించుకోవచ్చు.

ఈ ఆపరేషన్‌లో ఏడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన 51 కేసులకు సంబంధించి అరెస్టులు జరిగాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,172 నేర సంబంధాలు గుర్తించగా, అందులో 206 తెలంగాణకు సంబంధించినవిగా గుర్తించారు. ఇక యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. సైబర్ క్రైమ్‌లో మీ ఫోన్ మాత్రమే టార్గెట్ కాదు.. మీ బ్యాంక్ అకౌంట్, UPI, OTP, SIM, KYC వివరాలు, సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా నేరగాళ్లకు ఆయుధాలుగా మారొచ్చు. పార్ట్‌టైమ్ జాబ్, ఇన్‌స్టంట్ ఇన్‌కమ్, ట్రేడింగ్ ప్రాఫిట్, క్రిప్టో రిటర్న్స్, టాస్క్ కంప్లీట్ చేసి డబ్బు సంపాదించండి అంటూ వచ్చే ప్రతి ఆఫర్ నిజం కాదు. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో పోలీసులు, కస్టమ్స్, కొరియర్ అధికారులు అంటూ వీడియో కాల్స్ చేసి డబ్బులు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలి. ఎవరైనా మీ అకౌంట్‌ను ఉపయోగించుకోవడానికి కమీషన్ ఆఫర్ చేసినా.. ఒక్కసారి మాత్రమే అని చెప్పినా.. ఒప్పుకోకండి. ఎందుకంటే మీ అకౌంట్‌లో జరిగిన ట్రాన్సాక్షన్‌కు మీరు కూడా సమాధానం చెప్పాల్సి రావచ్చు. తెలియని లింకులపై క్లిక్ చేయకండి, OTPలు లేదా బ్యాంకింగ్ వివరాలు ఎవరికీ చెప్పకండి, సోషల్ మీడియాలో వచ్చిన అకౌంట్లకు డబ్బులు పంపకండి. ఏదైనా సైబర్ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి. ఈ ఆపరేషన్ చెప్పే అసలు మెసేజ్ ఒక్కటే.. ఈజీ మనీ అనిపించే ప్రతి ఆఫర్.. ఈజీ మనీ కాకపోవచ్చు. ఒక్క బ్యాంక్ అకౌంట్ ఇవ్వడం కూడా మీ జీవితాన్ని సైబర్ క్రైమ్ కేసులోకి లాగొచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us