Telangana: పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. గడువు మరింత పొడిగింపు.. అప్పటివరకు ఛాన్స్..

చేయూత పించన్లపై తెలంగాణ ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. కొత్త పించన్ల దరఖాస్తు గడువు ఆగస్ట్ 31వ తేదీతో ముగిసింది. దీంతో దరఖాస్తు గడువు పొడిగించాలని అర్హుల నుంచి డిమాండ్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు గడువును మరింత పొడిగిస్తూ నిర్ణయించింది.

Telangana: పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి గుడ్ న్యూస్.. గడువు మరింత పొడిగింపు.. అప్పటివరకు ఛాన్స్..
Telangana

Updated on: Aug 31, 2026 | 9:15 PM

తెలంగాణ ప్రభుత్వం చేయూత పథకం కింద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఊరట కలిగించింది. ఈ నెల 9వ తేదీ నుంచి కొత్తగా పింఛన్లను మంజూరు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తుండగా.. ఆగస్ట్ 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకోకపోవంతో.. ఇప్పుడు దరఖాస్తు గడువును మరింత పొడిగించింది. మరో 15 రోజుల పాటు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం.. సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. చాలామంది దరఖాస్తు చేసుకోకపోవడంతో గడువు పొడిగించాలని వారి నుంచి అభ్యర్థనలు వచ్చాయి. దీంతో వారి కోసం గడువు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

మొత్తం 2.50 లక్షల పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ దరఖాస్తులు మాత్రమే రికార్డు స్థాయిలో వస్తున్నాయి. ఆదివారం వరకు ఏకంగా 4,34,854 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే ప్రభుత్వం మంజూరు చేయనున్న పింఛన్ల కంటే రెట్టింపు మొత్తంలో దరఖాస్తులు అందాయి. మొత్తం 5 కేటగిరీల్లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు కేటగిరీల్లో సామాజిక పింఛన్ల అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్ నుంచి అత్యధికంగా 27,554 దరఖాస్తులు రాగా.. ములుగు జిల్లా నుంచి అత్యల్పంగా 3620 అప్లికేషన్లు అందాయి. అయితే దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు. ఇక సిటీలు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు పరిశీలన చేపడతారు. ప్రస్తుతం వృద్దాప్య, బీడీ కార్మికుల పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడం లేదు. అత్యధికంగా వీళ్లు ఉండటంతో వారిని మినహాయించారు. మిగతా కేటగిరీల్లో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో వృద్దులు, బీడీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు కొత్త పింఛన్లను మంజూరు చేయలేదు. దీంతో ఎప్పుడెప్పుడు అందుతాయా అని అర్హులు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్టకేలకు కొత్త పింఛన్ల మంజూరుకు రెడీ అయింది. దీంతో అర్హులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  అయితే గతంలో పోస్టాఫీస్ ద్వారా పించన్లను ప్రభుత్వం అందించేది. కానీ ఇప్పుడు నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. కాగా పింఛన్ల కోసం పెద్ద మొత్తంలో దరఖాస్తులు రావడంతో అధికారులు వడపోత చేపట్టనున్నారు. వారిలో నిజమైన అర్హులను ఎంపిక చేసి లబ్దిదారుల జాబితాలో చేర్చనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us