Telangana Elections: ఉప్పు- నిప్పు కలిసిపోయాయి. అసమ్మతి గళం మూగబోయింది. నిత్యం వివాదాలతో రగిలిపోయే ఆ ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. విభేదాలు పక్కనబెట్టి గెలుపే లక్ష్యంగా ముందుకు నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఇంతకు ఆ నియోజకవర్గం ఏంటీ? అసమ్మతి నేతకు అధిష్టానం ఇచ్చిన ఆఫర్ ఏంటో చూడండి.. అసమ్మతి వర్గాలను బుజ్జగిస్తూ ఎన్నికల్లో జోరుపెంచింది కాంగ్రెస్. ఇదే క్రమంలో వరంగల్ జిల్లాలో ఉప్పు-నిప్పుగా ఉన్న జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చింది. మొన్నటి వరకూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం సీటు విషయంలో ఇద్దరి నేతల మధ్య నువ్వా- నేనా అట్లు సాగింది వ్యవహారం. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ అగ్రనేతలు, జిల్లా పార్టీ నేతలు కలిసి నాయిని రాజేందర్ రెడ్డి – జంగా రాఘవరెడ్డి మధ్య వైరం సర్ధుమణిచారు. చివరకు తన డిమాండ్లకు ఓకే చెప్పడంతో అనుచరులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు జంగా రాఘవరెడ్డి. అక్కడే ఉన్న నాయిని రాజేందర్ రెడ్డిని ఆలింగనం చేసుకున్నారు.. ఒకరినొకరు పలకరించుకొని ఒక్కటేనని ప్రకటించారు. కాంగ్రెస్ ను కలికట్టుగా గెలిపిస్తామని ప్రకటించారు జంగా రాఘవరెడ్డి. నాయిని రాజేందర్ రెడ్డి గెలుపు కోసం నిస్వార్ధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు .
అయితే నాయిని రాజేందర్ రెడ్డికి వరంగల్ పశ్చిమ టికెట్ కేటాయించినందుకు గాను.. జంగా రాఘవరెడ్డికి డిసిసి ప్రెసిడెంట్ బాధ్యతలతో పాటు, MLC పదవి ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు చెప్పారు జంగా రాఘవరెడ్డి. తన గెలుపు కోసం సహకరిస్తానని ప్రకటించిన జంగా రాఘవరెడ్డి, ఆయన వర్గానికి నాయిని రాజేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జంగా రాఘవరెడ్డికి సముచిత స్థానం అధిష్టానం కల్పిస్తుందని రాజేందర్‌రెడ్డి చెప్పారు.
అయితే, మనసు మార్చుకున్న జంగా రాఘవరెడ్డి సహకరిస్తారా..? లేక ఎడమొఖం పెడముఖంగానే ఉంటారా..? లేక ఆయన చెప్పినట్లే వరంగల్ జిల్లాలో 5స్థానాల్లో గెలుపునకు కృషి చేస్తారనన్న మాటను నిలబెట్టుకుంటారా? చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..