Telangana: వావ్ అద్భుతం.. 50 ఏళ్ల నాటి గుడిని జాకీలతో పైకెత్తుతున్న ఊరి జనం.. ఎందుకో తెలుసా..?

దేవుడి గుడి అంటే భక్తులకు అపారమైన విశ్వాసం.. ఆ ఆలయం అంటే గ్రామానికి ఓ ప్రత్యేక గుర్తింపు. కానీ కాలం మారింది.. రహదారులు ఎత్తు పెరిగాయి.. ఆలయం మాత్రం కిందకు దిగిపోయింది. కొత్త ఆలయ నిర్మాణానికి భారీ ఖర్చులు అవుతాయని భావించిన గ్రామస్తులు.. 5 అడుగుల ఎత్తుకు గుడిని లేపేందుకు సంకల్పించారు. ఇందుకోసం సాంకేతిక నైపుణ్యంతో వినూత్న ఆలోచనకు తెరతీశారు.

Telangana: వావ్ అద్భుతం.. 50 ఏళ్ల నాటి గుడిని జాకీలతో పైకెత్తుతున్న ఊరి జనం.. ఎందుకో తెలుసా..?
Suryapet Temple Lifting

Edited By:

Updated on: Oct 09, 2026 | 5:46 PM

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి దాదాపు 5 దశాబ్దాల చరిత్ర ఉంది. 1976లో నిర్మించిన ఈ ఆలయం ఒకప్పుడు రహదారికంటే ఎత్తులో ఉండేది. కానీ కాలక్రమేణా కోదాడ-మేళ్లచెర్వు ప్రధాన రహదారిపై పలుమార్లు నిర్మాణ పనులు జరిగినా ప్రతిసారి రహదారి ఎత్తు పెరుగుతూ వచ్చింది. అలా రోడ్డు పైకి ఎదుగుతుంటే.. ఆలయం మాత్రం అదే స్థాయిలో ఉండిపోయింది. దీంతో రహదారిపై ప్రయాణించే వారికి ఆలయం దిగువన కనిపించే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా ఆలయాన్ని నిర్మించాలంటే భారీ ఖర్చులు.. ఎన్నో వ్యయప్రయాసలు. అంతేకాదు దశాబ్దాలుగా గ్రామస్తుల విశ్వాసంతో ముడిపడిన పాత ఆలయాన్ని వదిలేయలేదు. ఉన్న ఆలయాన్నే ఎత్తుకు లేపాలనే వినూత్న నిర్ణయం తీసుకున్నారు.

ఇందుకోసం ఈ తరహా పనుల్లో అనుభవం ఉన్న ఉత్తరప్రదేశ్, కేరళకు చెందిన కాంట్రాక్టర్ల సహకారం తీసుకున్నారు. మొత్తం 70 జాకీల సహాయంతో ఆలయాన్ని దశల వారీగా పైకి ఎత్తే ప్రక్రియ చేపట్టారు. ముందుగా ఒక అడుగు ఎత్తుకు లేపి.. ఆ స్థాయిలో కాంక్రీట్ పనులు చేస్తున్నారు. ఆ తర్వాత మరో అడుగు పైకి లేపి, అవసరమైన చోట రాతితో నిర్మాణాన్ని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇలా మొత్తం ఐదు అడుగుల ఎత్తుకు ఆలయాన్ని చేర్చాలన్నది గ్రామస్తుల లక్ష్యం.

ఒక్క పగులు కూడా రాకుండా..

ఆలయాన్ని పైకి లేపడం ఒక సవాలైతే.. దాని అసలు నిర్మాణాన్ని చెక్కుచెదరకుండా కాపాడుకోవడం మరో పెద్ద సవాల్ మారింది. అయితే ఇది సాధారణ నిర్మాణ పనుల్లాంటిది కాదు. ఆలయం కొద్దిగా అటూ ఇటూ కదిలినా గోడలు, గోపురంపై ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ పనులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆలయ గోడలు, గోపురం దెబ్బతినకుండా.. నిర్మాణంలో పగుళ్లు ఏర్పడకుండా కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకవైపు జాకీలతో ఆలయాన్ని పైకి లేపుతూనే.. మరోవైపు పునాదిని బలోపేతం చేసే పనులు చేపడుతున్నారు. దశలవారీగా ఎత్తు పెంచుతూ.. నిర్మాణం స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

కార్తీక మాసంలో పునఃప్రతిష్ఠకు సన్నాహాలు..

ఆలయాన్ని ఎత్తుకు లేపే పనులు పూర్తయిన తర్వాత పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గ్రామస్తులు సన్నాహాలు చేస్తున్నారు. కార్తీక మాసంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. అయితే పనుల పురోగతి, నిర్మాణ భద్రత, ఇతర ఏర్పాట్ల ఆధారంగా తుది కార్యక్రమాలు ఉండనున్నాయి. ఈ ప్రయత్నం వెనుక గ్రామస్తుల ఐక్యతతో పాటు.. తమ ఊరి ఆలయాన్ని కాపాడుకోవాలన్న బలమైన సంకల్పం కనిపిస్తోంది. కొత్తగా ఆలయం కట్టడం కంటే.. పాత ఆలయాన్ని కాపాడుకుంటూ సమస్యకు పరిష్కారం వెతకడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us