Telangana: తల్లిని చంపి నిజం దాచిన కొడుకు.. మరో కేసులో అరెస్ట్.. కట్ చేస్తే విచారణలో షాకింగ్ విషయాలు..

ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ కిరాతకుడు కన్నతల్లినే కడతేర్చాడు. కానీ ఈ విషయం బయటపడకుండా ప్రమాదవశాత్తు జరిగినట్లు అందరినీ నమ్మించాడు. చివరకు ఓ కేసులో నిందితుడు అరెస్ట్ అవ్వగా.. పోలీసుల విచారణలో తల్లిన చంపినట్లు ఒప్పుకున్నాడు. తన తల్లిని ఎలా చంపాడో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు.

Telangana: తల్లిని చంపి నిజం దాచిన కొడుకు.. మరో కేసులో అరెస్ట్.. కట్ చేస్తే విచారణలో షాకింగ్ విషయాలు..
Son Kills Mother

Updated on: Aug 21, 2025 | 7:08 AM

అమ్మ.. తన ప్రాణం పోతున్నా బిడ్డకు జన్మిస్తుంది. అమ్మ ప్రేమ దేనితో వెలకట్టలేనిది. బిడ్డ కోసం ఎంత కష్టమైన భరించే త్యాగం తల్లిది. అయితే డబ్బు కోసం నవమోసాలు కని, పెంచిన తల్లినే చంపేశాడు ఓ కిరాతకుడు. మానవత్వానికే ఈ ఘటన మాయని మచ్చగా నిలుస్తుంది. రోజురోజుకు మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. బీమా సొమ్ముపై ఆశపడి కన్నతల్లిని అత్యంత కిరాతకంగా చంపిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం తాండూరు గ్రామంలో ఈ దారుణం జరిగింది. అయితే ఓ కేసులో అరెస్ట్ చేసిన నిందితుడిని విచారించగా.. 8నెలల క్రితం తల్లిని చంపిన విషయం బయటపడింది.

జనవరి 9న తాండూరు గ్రామానికి చెందిన చాకలి జమున మరణించింది. ఇంట్లో కిందపడి ప్రమాదవశాత్తు చనిపోయిందని మొదట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆమె కొడుకు రాజు ఇటీవల ఓ హత్యాయత్నం కేసులో పట్టుబడ్డాడు. పోలీసులు అతడిని విచారిస్తున్నప్పుడు.. జమున మరణానికి సంబంధించిన అసలు నిజం బయటపడింది. రాజు తల్లి జమున పేరు మీద వివిధ బీమా సంస్థలలో దాదాపు రూ. 80 లక్షల ప్రమాద బీమా ఉంది. ఆ డబ్బుపై ఆశ పెంచుకున్న రాజు, తన తల్లిని చంపితేనే ఆ సొమ్ము తనకు దక్కుతుందని భావించాడు. అందుకే ఆమె ఇంట్లో ఉన్నప్పుడు తలపై బండరాళ్లతో దారుణంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన జమున అక్కడికక్కడే మరణించింది. ఈ విషయం బయటపడకుండా ఆమె ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయినట్లు పోలీసులను నమ్మించాడు.

చివరకు మరో కేసులో విచారిస్తున్నప్పుడు తన తల్లిని తానే హత్య చేసినట్లు రాజు అంగీకరించాడు. దీంతో పోలీసులు జమున కేసును తిరిగి విచారణ చేపట్టారు. ఈ ఘటన సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు ఎంతగా దిగజారుతున్నాయో తెలియజేస్తోంది. డబ్బు ఆశ కోసం కన్నతల్లిని చంపుతున్న దారుణాలకు ఇది నిదర్శనం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..