Telangana: చూశారా ఈ చిత్రం.. 25 ఇళ్లు మాత్రమే ఉండే కాలనీకి 6 పేర్లు..

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో కలకలం రేగింది. ఒక్క కాలనీకి ఆరు పేర్లు రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 25 ఇళ్లతో ఉన్న చిన్న కాలనీలో కులాల పేర్లతో బోర్డులు ఒక్కసారిగా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల్లోనే రెడ్డి, ఆర్యవైశ్య, ముదిరాజ్, విశ్వకర్మ, యాదవ్ ఎన్‌క్లేవ్ పేర్ల బోర్డులు వెలిశాయి.

Telangana: చూశారా ఈ చిత్రం.. 25 ఇళ్లు మాత్రమే ఉండే కాలనీకి 6 పేర్లు..
Gajwel Caste Board Row

Edited By:

Updated on: Sep 16, 2025 | 4:52 PM

సాధారణంగా ఏ కాలనీకైనా ఒకే పేరు ఉంటుంది. కానీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాత్రం ఒకే కాలనీలో ఆరు పేర్లు కనిపించడంతో అటుగా వెళ్లిన బయటివారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొత్తం 25 ఇళ్లు మాత్రమే ఉన్న ఈ చిన్న కాలనీలో ఇటీవల ఒక్కసారిగా కులాల పేర్లతో బోర్డులు ఏర్పాటవ్వటంతో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో ముట్రాజ్‌పల్లి రోడ్డు పక్కన ఇటీవలే వినాయకనగర్‌గా ఓ కొత్త కాలనీ ఏర్పడింది. అప్పటివరకు కుల భేదాలు లేకుండా అందరూ దీనిని వినాయకనగర్‌గానే పిలిచేవారు. కానీ రెండు రోజుల క్రితం పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

కాలనీకి వెళ్లే రోడ్డుపక్కన ఒక్కసారిగా ఐదు కొత్త బోర్డులు వెలిశాయి. వాటిపై వరుసగా రెడ్డి ఎన్‌క్లేవ్, ఆర్యవైశ్య ఎన్‌క్లేవ్, ముదిరాజ్ ఎన్‌క్లేవ్, విశ్వకర్మ ఎన్‌క్లేవ్, యాదవ్ ఎన్‌క్లేవ్ అంటూ పేర్లు రాసి ఉన్నాయి. దీంతో ముందుగా ఉన్న వినాయకనగర్ బోర్డు సహా మొత్తం ఆరు బోర్డులు ఒకే ప్రదేశంలో దర్శనమిస్తున్నాయి.

ఈ పరిణామం స్థానికుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. నిన్నమొన్నటి వరకు కలసిమెలసి ఉన్న కాలనీ వాసులు ఇలా ఒక్కసారిగా కులాల వారీగా విడిపోయి బోర్డులు ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెండు రోజుల్లోనే ఈ బోర్డులు ఏర్పడటంతో, అసలు ఎందుకు ఇలా చేశారో ఎవరూ అర్థం చేసుకోలేని పరిస్థితి నెలకొంది. కులాల కుంపట్లు సమాజంలో చిచ్చుపెడుతున్నాయని ఈ బోర్డులు చూసిన జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.