బాలింత చితాభస్మంలో కత్తెర.. అంత్యక్రియలు పూర్తయ్యాక బూడిదలో గుర్తింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తల్లీబిడ్డల మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. ప్రసవం అనంతరం మృతి చెందిన బాలింత చాట్ల వనజ చితాభస్మంలో శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కత్తెర కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న అధికారులు సంబంధిత వైద్యాధికారిని సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు..

బాలింత చితాభస్మంలో కత్తెర.. అంత్యక్రియలు పూర్తయ్యాక బూడిదలో గుర్తింపు
Bhadradri Medical Negligence Case

Updated on: Jun 19, 2026 | 10:44 AM

గుండాల, జూన్‌ 19: ప్రసవ వేదనతో ఆస్పత్రికి వస్తే.. నిర్లక్ష్యంగా చికిత్స చేసి తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్న కేసు తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. అదే రోజు మృతురాలికి పుట్టెడు దుఃఖంతో బంధువులు అంత్యక్రియలు నిర్వహించగా బాలింత చితాభస్మంలో కత్తెర ప్రత్యక్షమవడంతో అంతా షాకయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామంలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి చాట్ల వనజ (21)కు జూన్‌ 13 (ఆదివారం)న పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకువచ్చారు. అక్కడ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌ నర్సు సాధారణ ప్రసవం చేసింది. పుట్టిన ఆడశిశువుకు చలనం లేకపోవడంతో ఇల్లెందు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. ఇక వనజకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో ఖమ్మం తరలిస్తున్న సమయంలో మార్గం మధ్యలో ఆమె కూడా మృతి చెందింది. దీంతో చేసేదిలేక అదే రోజు సాయంత్రం (సోమవారం) బంధువులు వనజ, ఆమె బిడ్డ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.

కర్మకాండల్లో భాగంగా గురువారం ఉదయం అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు బాలింత చితాభస్మంలో శస్త్రచికిత్సల్లో ఉపయోగించే కత్తెర కనిపించడంతో కుటుంబ సభ్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మృతురాలికి సాధారణ ప్రసవమే అయిందని, రక్తస్రావం జరగడంతో మృతి చెందిందని వైద్యులు చెబుతుండగా కత్తెర ఎలా వచ్చిందని నిలదీస్తున్నారు. రక్తస్రావాన్ని ఆపేందుకు కత్తెర సాయంతో దూది పెట్టే క్రమంలో కత్తెర మర్చిపోయారా అనే సందేహాలు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలు మరణించారనేందుకు ఇదే సాక్ష్యమని గుండెలు బాదుకున్నారు. తల్లి, పుట్టిన శిశువు మృతి ఘటనలో గుండాల వైద్యాధికారి సుదీప్‌ను వివరణ కోరగా మృతురాలికి సాధారణ ప్రసవమే అయిందని, కత్తెర ఎలా వచ్చిందో తెలియదని అన్నారు. దీంతో కుటుంబ సభ్యులు DMHOకు ఫిర్యాదు చేయగా సుదీప్‌ను సస్పెండ్‌ చేస్తూ అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us