RS Praveen Kumar sensational comments: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో పలువురు నేతలకు మద్దతిస్తున్నట్లు తనపై దుష్ప్రచారం జరుగుతోందంటూ ఆయన పేర్కొన్నారు. తాను మద్దతిస్తున్నట్లు జరుగుతన్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ .. తన మద్దతు ఎప్పుడూ విద్య, వైద్యం, ఉపాధికే ఉంటుందంటూ స్పష్టంచేశారు. హుజూరాబాద్‌లో వెదజల్లే డబ్బు వాటికే పెట్టాలంటూ సూచించారు. ఇప్పటికే వీఆర్‌ఎస్ తీసుకుని ఇల్లు వెతుక్కునే పనిలో ఉన్నానని.. తనను వివాదాల జోలికి లాగొద్దంటూ ప్రవీణ్ కుమార్ కోరారు. తనను వివాదాల జోలికి లాగితే అంచనాలు తలకిందులవుతాయంటూ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
కాగా.. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శిగా పని చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు ప్రవీణ్ కుమార్ సోషల్ వెల్‌ఫేర్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గురుకుల విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.
అయితే.. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన ఐపీఎస్ పదవికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. పదవీ విరమణకు ఐదేళ్ల సమయం ఉండగానే ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతోనే రాజీనామా చేసినట్లు ప్రవీణ్ కుమార్ సైతం స్పష్టంచేశారు. అయితే.. ఆయన ప్రత్యేకంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారా.. లేక మరెదైన నిర్ణయం తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: