
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మార్చి 25వ తేదీ నుంచే కొనుగోళ్లు ప్రారంభించినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నెలకొల్పిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం ముందుగానే ప్రారంభించిందని చెప్పారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా ఇప్పటివరకు 433 కొనుగోలు కేంద్రాల్లో 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు జరిగినట్లు వెల్లడించారు.
ఇక.. ఈ యాసంగి సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని.. ఇప్పటి వరకు 5,422 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. మరో 1,727 కేంద్రాలు రెండు రోజుల్లో తెరిచేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఇప్పటికే అయిదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు మొదలయ్యాయని.. అయితే.. గతేడాది ఈ సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కూడా కాలేదన్నారు.
ఈ ఏడాది దాదాపు 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. అలాగే.. వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని చెప్పారు. ఇక.. పౌరసరఫరాల సంస్థ వద్ద 14 కోట్ల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని.. దాదాపు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లకు ప్రస్తుతం గన్నీ సంచులు సరిపోతాయన్నారు.
మిగతా గన్నీ సంచులను వీలైనంత త్వరగానే కొనుగోలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు వ్యవసాయ శాఖ అధికారులు. మొత్తంగా.. యాసంగి పంటకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ వ్యవసాయ శాఖ ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..