
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కబోతతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పిస్తోంది. రాష్ట్రానికి నేడు వర్షసూచన జారీ చేసింది. ఆదివారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షసూచన జారీ చేసింది. రాష్ట్రంలోని వాతావరణం నేటి నుంచి మారుతుందని, వడగాల్పులు తగ్గుతాయని తెలిపింది. వాతావరణశాఖ ఏం చెప్పిందో చూద్దాం.
ఇవాళ మంచిర్యాల, జయంశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, జయశంక్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ స్వల్ప వర్షం పడుతుందని స్పష్టం చేసింది. వర్షాల క్రమంలో ఈదురుగాలులు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌లో రానున్న రెండ్రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రానున్న కొద్ది రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి వచ్చే అవకాశముందని తెలిపింది.
అటు ఏపీకి కూడా వర్షసూచన జారీ చేశారు. పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ఇక మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయని తెలిపింది. పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతాయని స్పష్టం చేసింది. కాగా ఏపీ, తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అయితే ఇటీవల కొద్ది రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు ఎండ వేడి నుంచి ఊరట చెందుతున్నారు.