బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

Updated on: Mar 19, 2026 | 12:32 PM

వేసవి ఎండల మధ్య తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈ క్రమంలో రాగల రెండు రోజులు రెండు రాష్ట్రాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

రాగల రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ సమయంలో గంటకు 30 నుండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అటు ఏపీలోని పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో కూడా గాలి వేగం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద , విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట దెబ్బతినే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండల నుండి ఉపశమనం లభించినప్పటికీ, ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

 

Published on: Mar 19, 2026 12:32 PM
Follow Us