పోలింగ్ తేది దగ్గర పడుతున్న కొద్ది హుజూర్‌నగర్‌లో రాజకీయం మరింత హీటెక్కుతోంది. ఎలక్షన్ ఏజెన్సీ కిడ్నాప్ రాజకీయాల్లో కలకలం రేపింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య వివాదం.. చివరకు పోలీస్ స్టేషన్‌కి చేరింది. తన తరపున ఎన్నికల నిర్వహణ చూసే ఏజెన్సీ ప్రతినిధులను బలవంతంగా కారులో ఎక్కించుకొని.. కిడ్నాప్ చేశారంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డిపై.. ఎంపీ, కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అర్థరాత్రి హూజూర్‌నగర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈవిషయం సీఐకి తెలిసినా చర్యలు తీసుకోలేదంటూ మండిపడ్డారు. సైదిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. అర్థరాత్రి సమయంలో ఉత్తమ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు సైదిరెడ్డి. స్వామి, సృజన కు చెందిన ఏజెన్సీ సంస్థ.. తనకు గత మూడు నెలలుగా పనిచేస్తుందని చెప్పారు. దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. తన దగ్గరే కాకుండా .. మూడు రోజులుగా ఉత్తమ్‌తో కలిసి పనిచేస్తూ గోబెల్స్ ప్రచారానికి దిగారంటూ మండిపడ్డారు. ఒకే ఏజెన్సీ ఇరువురి దగ్గర పనిచేయడం అనైతికం అన్నారు సైదిరెడ్డి. మోసం చేసిన సృజన సంస్థపై చీటింగ్ కేసు పెట్టానని తెలిపారు. ప్రచారం నిర్వహించే తన ఇంట్లో వారిపై నీచంగా మాట్లాడిస్తున్నారంటూ మండిపడ్డారు సైదిరెడ్డి.
హుజూర్‌నగర్ లో సృజన ఏజెన్సీ రేపిన చిచ్చు రెండు పార్టీల మధ్య తారాస్థాయికి చేరింది. మధ్యలో సీఐ ఇష్యూ కూడా తెరపైకి తెచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అటు సృజన ఏజెన్సీపై సైదిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. సైదిరెడ్డితో పాటు సీఐపై ఫిర్యాదు చేశారు ఉత్తమ్. ఈ ఫిర్యాదుల మీద ఎలక్షన్ కమీషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..