
సిగరెట్ తాగే అలవాటు లేకపోయినా పక్కన ఉన్నవారు పొగ తాగితే అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనినే ప్యాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్‌హ్యాండ్ స్మోకింగ్ అంటారు. ఈ పరోక్ష ధూమపానం కారణంగా ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతున్నారని.. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగకూడదని చట్టం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఇటీవల గుండె, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న బాధితుల్లో ఇలాంటి వారు కూడా ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల ఇలాంటి ఘటనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వెలుగు చూసింది. చిగురుమామిడి మండలానికి చెందిన ఓ వ్యక్తికి అసలు సిగరెట్ తాగే అలవాటు లేదు. అయినప్పటికీ ఆయన గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి సిగరెట్ తాగే అలవాటు ఉందా అని ప్రశ్నించగా, లేదని సమాధానం ఇచ్చాడు. అయితే ఆయన ఓ షాపు నిర్వహిస్తుండటంతో అక్కడికి వచ్చే చాలామంది సిగరెట్లు తాగేవారు. వారి నుంచి వెలువడే పొగను నిరంతరం పీల్చడం వల్లే అనారోగ్యానికి గురై ఉండవచ్చని ఈ ఘటనలో తెలుస్తోంది. ఇలాంటి కేసులు పలు ఆసుపత్రుల్లో వెలుగులోకి వస్తున్నాయని చెబుతున్నారు.
చిన్నారులు, గర్భిణులపైనా ప్రభావం
ప్యాసివ్ స్మోకింగ్ ప్రభావం కేవలం పొగ పీల్చే వ్యక్తికే పరిమితం కావడం లేదు. ఇంట్లో ఎవరికైనా సిగరెట్ తాగే అలవాటు ఉంటే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోంది. ముఖ్యంగా గర్భిణులు, చిన్నారులు ఈ పొగ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పొగ తాగే అలవాటు లేని వారు సైతం ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా ప్యాసివ్ స్మోకింగ్ కారణంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ముప్పు కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై చర్యలు ఏవీ?
బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే రూ.500 జరిమానా విధించడంతో పాటు కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ, నిబంధనల అమలుపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పొగరాయుళ్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొందరు బైక్‌పై ప్రయాణిస్తూ కూడా సిగరెట్లు తాగుతున్నారు. ఈ క్రమంలో వెలువడే పొగ పక్కనే వెళ్లే ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తోంది. అంతేకాదు.. ఒకే చోట 20 నుంచి 30 మంది వరకు సిగరెట్లు తాగుతుండటంతో చుట్టుపక్కల ప్రాంతమంతా పొగ వ్యాపిస్తోంది. దీంతో అక్కడికి వచ్చే వారితో పాటు సమీపంలో నివసించే వారు, పనిచేసే వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
పొగ తాగని వారే ఆసుపత్రుల పాలవుతున్నారంటున్న స్థానికులు
తమకు సిగరెట్ తాగే అలవాటు లేకపోయినా ఇతరుల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీ తాగడానికి, టిఫిన్ చేయడానికి వెళ్లిన ప్రతిచోటా కొందరు సిగరెట్లు తాగుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. పొగ తాగని వారు కూడా అనారోగ్యం బారిన పడి ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వాపోతున్నారు.
మరోవైపు ప్యాసివ్ స్మోకింగ్ కారణంగా ఊపిరితిత్తుల సమస్యలతో తమ వద్దకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సిగరెట్ తాగే వ్యక్తి మాత్రమే కాదు.. పక్కనే ఉండి ఆ పొగను పీల్చే వ్యక్తి కూడా ప్రమాదంలో పడుతున్నాడు. అందుకే ప్యాసివ్ స్మోకింగ్‌పై అవగాహన పెంచడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో ధూమపాన నిషేధ నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.