
ఆన్లైన్లో పాత వాహనాలు అమ్మేటప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరో ఘటన గుర్తుచేసింది. బుల్లెట్ కొనుగోలు చేస్తానంటూ OLXలో ప్రకటన ఇచ్చిన యువకుడిని సంప్రదించిన ఓ వ్యక్తి.. కస్టమర్‌గా నమ్మించి చివరకు బైక్‌తో ఉడాయించాడు. టెస్ట్ రైడ్ చేస్తానంటూ తీసుకెళ్లిన వాహనాన్ని తిరిగి తీసుకురాకుండా మాయమయ్యాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం మొండికుంటలో చోటుచేసుకుంది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్రాపురానికి చెందిన భరత్ చంద్రారెడ్డి తన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్‌ను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం OLXలో బైక్ వివరాలతో ప్రకటన పెట్టాడు. దీనిని చూసిన ఓ వ్యక్తి బుల్లెట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఫోన్ చేశాడు. వాహనాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వస్తానని చెప్పి భరత్ చంద్రారెడ్డిని నమ్మించాడు.
అనుకున్నట్లుగానే అతడి వద్దకు చేరుకున్న సదరు వ్యక్తి బైక్‌ను పరిశీలించాడు. కొనుగోలు చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుతూ.. ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తానని అడిగాడు. కొనుగోలుదారుడేనని నమ్మిన భరత్ అందుకు అంగీకరించాడు. దీంతో బుల్లెట్ తీసుకుని వెళ్లిన ఆ వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాలేదు. అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో భరత్‌కు అసలు విషయం అర్థమైంది.
తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. బుల్లెట్ కొనుగోలు చేస్తానంటూ పరిచయం పెంచుకుని, టెస్ట్ రైడ్ పేరుతో తన వాహనాన్ని తీసుకెళ్లిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. తన బైక్‌ను గుర్తించి తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరుతున్నాడు. ఆన్లైన్ విక్రయాల పేరుతో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్న ఘటనల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది.