
అతి బరువు అనేది ప్రస్తుత సమాజంలో అనేక అనర్థాలకు, దీర్ఘకాలిక రోగాలకు ప్రధాన కారణమవుతోంది. శరీరాన్ని రోగాల కూపంగా మార్చే ఈ ఊబకాయం నుండి బయటపడాలని చాలా మంది ఇటీవలి కాలంలో డైటింగ్, వ్యాయామాలు చేస్తున్నారు. అయితే కఠినమైన నియమాలు ఎక్కువ కాలం కొనసాగించలేక, బద్ధకంతోనో లేదా ఆశించిన ఫలితాలు రాకనో చాలా మంది ఆరంభ శూరులుగా మిగిలిపోతూ మధ్యలోనే వదిలేస్తున్నారు. అలాంటి వారికి నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలెగామ్ గ్రామానికి చెందిన గంగాప్రసాద్ అనే యువకుడు ఒక అద్భుతమైన రోల్ మోడల్‌గా నిలుస్తున్నాడు. తన పట్టుదలతో కేవలం ఒకే ఒక్క ఏడాదిలో ఏకంగా 70 కేజీల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
గతేడాది వరకు గంగాప్రసాద్ 132 కిలోల భారీ కాయంతో తీవ్ర ఇబ్బందులు పడేవాడు. నడవాలన్నా, రోజువారీ పనులు చేసుకోవాలన్నా కష్టంగా మారేది. అన్నింటికీ మించి అద్దంలో తనకు తానే నచ్చకపోవడంతో మానసికంగా ఎంతో బాధపడ్డాడు. ఎలాగైనా సరే తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, బరువు తగ్గాలని బలంగా నిశ్చయించుకున్నాడు. సర్జరీలు, లీటర్ల కొద్దీ వెయిట్ లాస్ ప్రొడక్టుల జోలికి వెళ్లకుండా.. ప్రకృతి సిద్ధమైన పద్ధతిలోనే బరువు తగ్గాలని ఒక పక్కా ప్లాన్ వేసుకున్నాడు.
బరువు తగ్గాలనే ప్రయాణంలో గంగాప్రసాద్ చూపించిన క్రమశిక్షణ నిజంగా అభినందనీయం. మనం ప్రతిరోజూ తినే అన్నంను గంగాప్రసాద్ తన ఆహారం నుండి పూర్తిగా పక్కన పెట్టేశాడు. అన్నానికి ప్రత్యామ్నాయంగా కేవలం జొన్న రొట్టెలు, ఇతర తృణధాన్యాల రొట్టెలను మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. శరీరంలోని కొవ్వును, మలినాలను కరిగించడానికి ప్రతిరోజూ ఏకంగా 8 లీటర్ల నీటిని తాగుతూ వచ్చాడు.
ప్రస్తుతం మార్కెట్లో బరువు తగ్గడానికి వందలాది పౌడర్లు, టాబ్లెట్లు, బెల్టులు అందుబాటులో ఉన్నాయి. కానీ గంగాప్రసాద్ వీటిలో దేనినీ ముట్టలేదు. అలాగే ఏ ఆసుపత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకోలేదు. ప్రతిరోజూ ఉదయాన్నే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం, రాత్రి పూట ఎనిమిది గంటల పాటు ప్రశాంతమైన నిద్ర పోవడం వల్లే ఇది సాధ్యమైందని గంగాప్రసాద్ సగర్వంగా చెబుతున్నాడు. ఈ పక్కా లైఫ్‌స్టైల్ మార్పు వల్ల ఆయన 132 కేజీల నుండి ఏకంగా 62 కేజీలకుచేరుకున్నాడు.
“కృషి ఉంటే మనుషులు రుషులవుతారు” అనే సామెతను గంగాప్రసాద్ నిజం చేసి చూపించాడు. బరువు తగ్గాలని ఉన్నా, బద్ధకంతో రేపు.. ఎల్లుండి అంటూ వాయిదా వేసే వారికి గంగాప్రసాద్ సక్సెస్ స్టోరీ ఒక కనువిప్పు. ఒంట్లో ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి డబ్బులు కాదు.. పట్టుదల, క్రమశిక్షణ ఉంటే చాలు, ఏదైనా సాధ్యమే అని ఈ భైంసా యువకుడు నిరూపించాడు. ప్రస్తుతం గంగాప్రసాద్‌ను చూసి స్థానిక యువతతో పాటు, నెటిజన్లు కూడా “వారెవ్వా గంగాప్రసాద్.. నీ పట్టుదలకు హాట్సాఫ్” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.