
కోతుల వీరంగం ఓ మహిళ ప్రాణాన్ని బలితీసుకుంది. బిల్లింగ్ పైన కోతులు వీరంగం సృష్టించాయి.. ఈ క్రమంలో మెట్ల సమీపంలో ఉన్న ఓ మహిళ పైన సిమెంట్ ఇటుకలు మీద పడ్డాయి. దీంతో తలకు తీవ్ర మైన గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందింది. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కోతులు ఆడుకుంటూ డాబాపై ఉన్న సిమెంట్ ఇటుకను నెట్టడంతో.. అది మహిళ పై పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురి ఇందిరమ్మ కాలనికి చెందిన కొనపర్తి పద్మ (50) ఇంటి కింద ఉంది.. ఈ క్రమంలోనే.. మిద్దెపై ఆడుకుంటున్న కోతుల గుంపు రెచ్చిపోయింది.. అవి ఆడుకుంటూ.. డాపై ఉన్న భారీ సిమెంట్ ఇటుకలను కదిలించాయి. దీంతో సిమెంట్ ఇటుకలు డాబాపై నుంచి కింద పడ్డాయి.
ఓ ఇటుక.. ఇంటి కింద ఉన్న పద్మ తలపై పడింది.. అది భారీగా ఉండటంతో.. పద్మ తలకు బలంగా తగిలింది.. తల పగిలి తీవ్ర రక్తస్రావం అయి.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనతో పద్మ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల కాలంలో ధర్మపురిలో కోతుల వీరంగం పెరిగిపోయింది. స్థానికులు బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఎటు చూసినా గుంపులు గుంపులుగా కోతులు తిరుగుతున్నాయి. గతంలో కోతుల భయంతో మిద్దె పైనుంచి ఓ మహిళ పడి మృతి చెందిన ఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. ముఖ్యంగా విద్యార్థులు ఒంటరిగా పాఠశాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంది. తరచుగా కోతులు దాడులకు దిగుతున్నాయి. పద్మ మృతి తో స్థానికంగా భయం నెలకొంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో మృతురాలు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..