సూర్యాపేటలో రాజ్‌కుమార్ ఆచూకీ..? అక్కడికి బయలుదేరిన పోలీసు బృందాలు

అదృశ్యమైన రాజ్‌కుమార్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సూర్యాపేట–కోదాడ మధ్య ప్రాంతంలో రాజ్‌కుమార్ ఉన్నట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. దీంతో హైదరాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట ఎస్పీతో మాట్లాడగా, ప్రత్యేక పోలీసు బృందాలు వెంటనే అక్కడికి బయలుదేరాయి. రాజ్‌కుమార్ ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

సూర్యాపేటలో రాజ్‌కుమార్ ఆచూకీ..? అక్కడికి బయలుదేరిన పోలీసు బృందాలు
Raj Kumar

Updated on: Jul 13, 2026 | 12:04 PM

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో 6 హత్యలు చేసి అదృశ్యమైన రాజ్‌కుమార్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌కుమార్ సూర్యాపేట–కోదాడ మధ్య ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సూర్యాపేట సమీపంలో రాజ్‌కుమార్ కనిపించినట్లు గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సమాచారాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అందిన సమాచారం మేరకు రాజ్‌కుమార్‌ను గుర్తించి సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యేక పోలీసు బృందాలను సూర్యాపేట వైపు పంపించారు.

సూర్యాపేట–కోదాడ ప్రాంతంలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఫోన్ కాల్ ద్వారా వచ్చిన సమాచారాన్ని ధృవీకరిస్తూ, స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆచూకీపై మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా, సూర్యాపేట నుంచి వచ్చే తాజా సమాచారం కోసం అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో సంచలనం సృష్టించిన హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మైనర్ బాలికతో పాటు హత్యకు గురైన ఇద్దరి మృతదేహాలకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. మరోవైపు ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ భార్య, ఇద్దరు చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు… అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ వెంటనే వారికి అంత్యక్రియలు నిర్వహించారు.

తనపై పోక్సో కేసు పెట్టారన్న పగతో రగిలిపోయిన నిందితుడు రాజ్‌కుమార్.. ఒకే రాత్రి నరరూప రాక్షసుడిగా మారాడు. గత మే 16న ఓ బాలికను వేధిస్తున్నాడనే కారణంతో ఆమె తల్లి రాజ్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదై జైలుకు వెళ్లిన నిందితుడు, ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనను జైలుకు పంపిన వారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. రాత్రి 11గంటల ప్రాంతంలో బాలిక ఇంటికొచ్చాడు నిందితుడు రాజ్‌కుమార్‌. అక్కడే మెట్లమీద కూర్చుని బీరు తాగి, తలుపుకొట్టాడు. బాలిక తల్లి తలుపు తీయగానే కత్తితో పొడిచాడు. తర్వాత నిద్రిస్తున్న బాలిక నాన్నమ్మను చంపేశాడు. అప్పటికే కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడి ఉన్న బాలిక తల్లిని ఇంటిబయటకు తీసుకొచ్చి కత్తితో పొడిచి పొడిచి చంపాడు. అనంతరం బాలికను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చాడు. షాబాద్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన భార్యా పిల్లలు ఉంటున్న దైవాలగూడకు వచ్చాడు. అక్కడే ఊరిబయట ఉన్న చెరువు దగ్గరకు బాలికను తీసుకెళ్లి చంపేశాడు. ఆ తర్వాత చెరువు దగ్గర నుంచి 250మీటర్ల దూరంలో ఉండే తన భార్య ఇంటికి వచ్చాడు. ఇక్కడ భార్యా భర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ముందు భార్యను చంపేశాడు. తర్వాత నిద్రిస్తున్న తన పిల్లలను గొంతుకోసి చంపాడు.

ఆరుగురిని హతమార్చిన అనంతరం రాజ్‌కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. తాను ఆరుగురిని చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అయితే, బాలిక కుటుంబంపై కక్షతో ఉన్న నిందితుడు.. తన భార్యాపిల్లలను ఎందుకు చంపాడనేది పోలీసులకు మిస్టరీగా మారింది.

రాజ్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలంటూ బాలిక కుటుంబసభ్యులు రోడ్డుపైకి వచ్చారు. షాబాద్ చౌరస్తాలో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. హంతకుడు రాజ్‌కుమార్‌ను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి బాధితులతో మాట్లాడారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సైని సస్పెండ్‌ చేసినట్లు ప్రకటించారు.

Follow Us