Minister KTR: రాష్ట్రపతి ఎన్నికల్లో సిన్హాకు TRS మద్దతు అందుకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..

కేంద్రంలో బీజేపీ నియంతలా, నిరంకుశ విధానాలతో వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ మండిపడ్డారు.

Minister KTR: రాష్ట్రపతి ఎన్నికల్లో సిన్హాకు TRS మద్దతు అందుకే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి కేటీఆర్..
Follow us

|

Updated on: Jun 27, 2022 | 1:45 PM

Minister KTR on Modi Govt: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ఐటీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి వెంట నిలిచామని కేటీఆర్ పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలకు గౌరవమిచ్చే వ్యక్తిగా యశ్వంత్ సిన్హాకు మద్దుతునిస్తున్నామని టీఆర్ఎస్ నేత తెలిపారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ నియంతలా, నిరంకుశ విధానాలతో వ్యవహరిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందంటూ మండిపడ్డారు. విపక్షాల మీద దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని విమర్శించారు. అందుకే బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు, కేంద్ర నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి వెంట నిలిచామని కేటీఆర్ పేర్కొన్నారు. జులై 18న ఎన్నికల్లో ఓటు వేయడమే కాదు, అవకాశం ఉంటే ఇతర పార్టీలను కూడా కొరతామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన్ను హైదరాబాద్ కూడా రావాలని కోరుతున్నామని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే జుమ్లా.. లేదంటూ హమ్లా అని.. ప్రతి దానికి సమయం వస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం ఏం ఇచ్చిందో వైట్ పేపర్‌ విడుదల చేయాలని.. 8 ఏళ్లల్లో ఏం ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎక్కువ ఇచ్చినట్లు రుజువు చేస్తే తక్షణమే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. మోడీ పాలనలో అత్యధికంగా నిరుద్యోగం పెరిగిందని.. మోడీ పాలనలో విషం తప్ప.. విషయం లేదంటూ విమర్శించారు. రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేశారని.. దళితులకు ఏం ఒరిగిందంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

భీష్ముడు చాలా మంచివాడు. కానీ కౌరవుల వైపు ఉన్నందుకు ఓటమి తప్పలేదంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ద్రౌపది ముర్ము మంచి వ్యక్తే కావొచ్చు.. ఆమె గురించి మాకు తెలియదు.. ఒడిశాలో స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఆందోళనలో గిరిజనులను కాల్చిన ఘటనలో ఆమె కనీసం ఖండించలేదంటూ కేటీఆర్ వివరించారు. గిరిజనుల మీద బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటే.. 12శాతం రిజర్వేషన్ల కోసం తాము పంపిన బిల్లుకు ఆమోదం చెప్పాలి. కానీ ఇంతవరకు చేయలేదన్నారు. గిరిజన యూనివర్సిటీ విషయం ఇంతవరకు ఏమీ తేల్చలేదన్నారు. తెలంగాణలోని గిరిజన మండలాలను ఏకపక్షంగా తీసుకెళ్లి కలిపారు.. అప్పుడేమి మాట్లాడలేదంటూ వివరించారు. చిత్తశుద్ధి ఉంటే ఈ 7 మండలాలు తిరిగివ్వాలి.. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.. రిజర్వేషన్లు పెంచాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల కూటమిలో ఉన్నామని ఎవరు చెప్పారు? కేవలం ఒక సంతకం చేసినంత మాత్రాన కూటమిలో ఉన్నట్టా..? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

యశ్వంత్ సిన్హా విషయంలో మమత బెనర్జీ, శరద్ పవార్ కోరిన నేపథ్యంలో తాము సపోర్ట్ చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. సాలు దొర కాంపెయిన్ రాజకీయ భావదారిద్ర్యానికి నిదర్శనం.. వారికంటే చిల్లరగా ఉండాలంటే మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేయవచ్చు అని అభిప్రాయపడ్డారు. గుజరాత్ రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా చేసిన మోడీ రాష్ట్రంలో ఇప్పటికీ కరెంట్ ఇబ్బందులు ఉన్నాయన్నారు. ద్రౌపది ముర్ము సొంతూరులో కూడా కరెంట్ లేదు. ఇప్పటికిప్పుడు ఇస్తున్నారని కేటీఆర్ తెలిపారు. బీజేపీ చేసేవన్నీ జుమ్లా వ్యవహారాలేనని.. అయితే జుమ్లా, లేదంటే హమ్లా అంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

ఆనాడు ఎన్టీఆర్‌ని ఇలాగే గద్దె దించితే, మళ్లీ తిరుగులేని మెజారిటీతో గెలిచారు. ఈ పరిస్థితి బీజేపీకి కూడా తలెత్తుతుందని గుర్తుచేశారు. తెలంగాణ ఈ దేశానికి ఎక్కువ ఇచ్చిందా… ఈ దేశం తెలంగాణకు ఎక్కువ ఇచ్చిందా… శ్వేత పత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తనకున్న సమాచారం ప్రకారం.. దేశంలో తెలంగాణ 4వ ఆర్ధిక శక్తి.. అంతగా దేశానికి అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ సొమ్ము గుజరాత్, యూపీ, బీహార్ లో ఖర్చు పెడుతున్నారు తప్ప మరేమీ లేదంటూ విమర్శించారు. రూపాయి ఇస్తే 17 పైసలు వెనక్కి వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..