నామినేషన్ల పర్వం ముగియంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం పీక్స్‌కి చేరింది. అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పవర్ పాలిటిక్స్‌తో మరింత హీటెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కరెంట్ వార్ కాకరేపుతోంది. రెండు పార్టీల మధ్య రైతులకు ఉచిత కరెంట్ ప్రధానాంశంగా మారింది. కర్నాటకలో కాంగ్రెస్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కర్నాటక కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా 24 గంటల ఉచిత కరెంట్ ను ఇవ్వడం లేదని చెప్పకనే చెప్పారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ఉచిత కరెంట్, గ్యారంటీలు, డిక్లరేషన్ పైనే ప్రచారం జోరుగా నడుస్తుంది. కర్నాటకలో అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇవ్వడం లేదని బీఆర్ ఎస్ విమర్శిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రతి సభలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. తమకు 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వనందుకు నిరసనగా కర్నాటకకు చెందిన కొందరు రైతులు ఇటీవల తాండూరులో నిరసన కూడా తెలిపారు. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని సీఎం కోరుతున్నారు. అవి ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయడం లేదన్నారు. కర్ణాటకలో కరెంట్ తీగలు పట్టుకొని 19 గంటలు నిలబడడానికి తాను సిద్ధంగా ఉన్నాన్నారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి.
బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్టుగానే కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల తాండూరు సభలో తమ రాష్ట్రంలో రైతులకు ఐదు గంటల కరెంట్ ఇస్తున్నట్టు చెప్పారు. తాము హామీ ఇచ్చినట్టు గా 24 గంటల ఉచిత కరెంట్ ను ఇవ్వడం లేదని అంగీకరించారు. ఇప్పుడు సూర్యాపేట, కోదాడ సభల్లో కూడా 5 గంటల విషయాన్నే చెప్పారు. కర్నాటకలో తామేం చేస్తున్నామో చూపిస్తాం రండి అంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు శివకుమార్. అయితే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు సీఎం కేసీఆర్.
ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా కర్నాటక రైతులు తెలంగాణ సరిహ్దద్దుజిల్లాలో ఆందోళనకు దిగారు. గద్వాల, కొడంగల్, పరిగి, నారాయణఖేడ్‌లో కర్నాటక రైతులు పెద్దయెత్తున తరలివచ్చి కాంగ్రెస్ ఇస్తున్న హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలను కలిసి విన్నవిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా కర్నాటక రైతులు ఆందోళనకు దిగారు.
తమ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం 3 నుంచి 4 గంటలు మాత్రమే కరెంటు ఇస్తొందని..దాంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యారంటీలతో తెలంగాణ ప్రజలు మోసపోవద్దని నినాదాలు చేశారు.
మరో వైపు కాంగ్రెస్ విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ పై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముస్లింలు, బీసీల మధ్య చిచ్చు పెట్టే ఆ డిక్లరేషన్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. మొత్తంగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. పవర్ ఫుల్ యుద్ధానికి తెరలేచింది. ఇప్పుడే ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ ఇంకే లెవల్‌కు చేరుకుంటుందో చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…