Janasena: జనసేన పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు టీ గ్లాస్ ను ఇక్కడ కోల్పోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నిబంధనల మేర పోటీ చేయాల్సిన స్థానాల్లో పోటీ చేయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 150 వార్డులున్నాయి. నిబంధనల ప్రకారం కామన్ గుర్తుకోసం కనీసం పదిశాతం స్థానాల్లో ఆపార్టీ పోటీ చేయాలి. కానీ, గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అలా చేయడంలో విఫలం అయింది. అందుకే డిసెంబర్ 2020 ఎన్నికల్లో జనసేనకు కేటాయించిన టీగ్లాసు గుర్తును కోల్పోయింది.
భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా ఓట్ల విభజనను నివారించడం కోసం గ్రేటర్ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగుతున్నట్లు అప్పట్లో ఎన్నికల సంఘానికి జనసేన అధ్యక్షుడు లేఖ రాశారు. అయినా.. ఇప్పుడు గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించి.. పార్టీ ఉమ్మడి గుర్తును కేటాయించాలని కోరారు. కానీ, జనసేన పార్టీ చిహ్నాల రక్షణ కోసం 2018లో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లఘిస్తున్నట్టు భావించిన ఎన్నికల కమీషన్.. ఆ పార్టీ వివరణ సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ఆ పార్టీ తన ఉమ్మడి గుర్తు టీగ్లాసును కోల్పోవడమే కాకుండా, దానికోసం చేసిన డిపాజిట్ ను కూడా కోల్పోయింది.
జనసేనతో పాటు మరో నాలుగు పార్టీలు కూడా తమ ఉమ్మడి గుర్తును కోల్పోయాయి. భారతదేశ ప్రజ బంధు పార్టీ (ట్రంపెట్), హిందుస్తాన్ జనతా పార్టీ (కొబ్బరి ఫామ్), మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (గ్యాస్ సిలిండర్) అలాగే, ఇండియన్ ప్రజ కాంగ్రెస్ (విజిల్) పార్టీలు కూడా మొత్తం 150 వార్డులలో 10 శాతం పోటీ చేయడంలో విఫలమైనందున తమ ఉమ్మడి గుర్తును కోల్పోయాయి.