
అడవులు, గుట్టల్లో స్వేచ్ఛగా సంచరించే ఎలుగుబంట్లు దారి తప్పి జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా జనగామ జిల్లాలోని ఓ గ్రామంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. గుట్టపై నుంచి గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి రామాలయం పరిసరాల్లో సంచరించడంతో స్థానికులు భయంతో వణికిపోయారు వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండల కేంద్రంలోని వేల్పుకొండ గుట్టపై సంచరిస్తున్న ఎలుగుబంటి దారి తప్పి తరచూ గ్రామంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా గుట్ట దిగువన ఉన్న రామాలయం వద్ద ఎలుగుబంటి కనిపించింది. చీకటి పడిన తర్వాత ఆలయ పరిసరాల్లోకి వచ్చిన ఎలుగుబంటి కొంతసేపు అక్కడే సంచరించింది. దీంతో దాన్ని గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఎలుగుబంటి గ్రామంలోకి వచ్చిన విషయం తెలుసుకున్న స్థానికులు అప్రమత్తమయ్యారు. వెంటనే వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇతర గ్రామస్తులకు సమాచారం అందించి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎలుగుబంటిని గమనించిన కొందరు గ్రామస్తులు గట్టిగా అరవడంతో అది తిరిగి వేల్పుకొండ గుట్టపైకి వెళ్లిపోయింది.
అయితే, ఎలుగుబంటి మళ్లీ గ్రామంలోకి వస్తుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. వన్యప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, వాటిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.