
హైదరాబాద్ మే 8వ తేదీ: అర్థరాత్రి ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన ఓ జోమాటో డెలివరీ బాయ్‌పై పోలీసులు దాడి చేసిన ఘటన సికింద్రాబాద్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అర్థరాత్రి వేళ ఐస్‌క్రీమ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్తున్న ఆజం అనే డెలివరీ బాయ్‌ను అదే సమయంలో అక్కడ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ SHO బి. సురేష్ కుమార్ అడ్డుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఎస్‌హెచ్‌ఓ సురేష్ కుమార్ సదరు యువకుడిని ప్రశ్నిస్తూనే ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై, అతడిని చెంపపై కొట్టడమే కాకుండా లాఠీతో విచక్షణారహితంగా కొట్టారు. ఈ దృశ్యాలన్ని అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది..
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఈ ఘటన ఎస్‌హెచ్‌ఓ సురేష్ కుమార్ స్పందించారు. ఆజం తన ప్రశ్నలకు దురుసుగా సమాధానం ఇచ్చాడని, అందుకే ఆవేశంలో కొట్టాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, ఆ సమయంలో ఆజం యూనిఫాంలో లేడని ఆయన పేర్కొన్నారు.
అయితే ఇక్కడ మరో విచిత్రమేమిటంటే, తమ చేతిలో దెబ్బలు తిన్న ఆజంపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పోలీస్ యాక్ట్ సెక్షన్ 70(బి) కింద కేసు బుక్ చేశారు. అలాగే, అర్థరాత్రి వేళ కార్యకలాపాలు సాగిస్తున్నందుకు స్కూప్స్ ఐస్‌క్రీమ్ మేనేజర్‌పై కూడా కేసు బుక్ చేసినట్టు తెలుస్తోంది.
వీడియో చూడండి..
ఇదిలా ఉండగా వీడియో వైరల్ కావడంతో పోలీసలు తీరుపై నెటిజన్లు మండి పతున్నారు. తప్పు చేసిన అధికారిపై చర్యలు తీసుకోకుండా, బాధితుడిపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పొట్టకూటి కోసం రాత్రి పగలు కష్టపడే సామాన్య కార్మికులపై పోలీసుల ప్రతాపం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి సదరు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.